విజయాలను ప్రసాదించే వినాయకుడు

వినాయకుడిని దర్శించడం వలన ... ఆ స్వామిని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ముందుగా గణపతిని పూజించి ఆ తరువాతనే దైవకార్యాలను ... శుభకార్యాలను ప్రారంభిస్తూ వుంటారు. తాము తలపెట్టే ప్రతి పనికి వినాయకుడి అనుమతినీ .. ఆశీస్సులను తీసుకోవడం చేస్తుంటారు. విద్య .. ఉద్యోగం .. వివాహం .. సంతానం .. సౌభాగ్యం .. ఇలా తమ మనోభీష్టం నెరవేరడానికిగాను వినాయకుడి పాదాలను ఆశ్రయిస్తుంటారు.

సాధారణమైన రోజుల్లో వినాయకుడిని దర్శించుకునే భక్తుల్లో విద్యార్థినీ విద్యార్థులు కనిపించినప్పటికీ, పరీక్షల సమయలో వీరి సంఖ్య పెరుగుతూ వుంటుంది. ఈ సమయంలో విద్యార్థులు వినాయకుడి సన్నిధిలో గుంజీళ్లు తీయడం ... ప్రదక్షిణలు చేయడం ... తమ పెన్నులను ఆయన సన్నిధిలో వుంచి పూజ జరిపించడం చేస్తుంటారు. కొంతమంది దగ్గరలో గల వినాయక క్షేత్రాలను కూడా దర్శించి, తాము ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించేలా చేయమని ప్రార్ధిస్తుంటారు.

ఈ కారణంగా పరీక్షల సమయంలో వినాయక క్షేత్రాలు విద్యార్థినీ విద్యార్థులతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అలాంటి వినాయక క్షేత్రాల్లో 'అయినవిల్లి' ఒకటిగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో గల చివరి రెండు వారాల్లో ఇక్కడి వినాయకుడికి వేలసంఖ్యలో గల పెన్నులతో అభిషేకం జరుపుతూ వుండటం విశేషం. ఈ విధంగా అభిషేకించిన పెన్నులను విద్యార్థినీ విద్యార్థులకు పంచుతారు. వినాయకుడిని పూజించడం వలన ... ఆ స్వామిని అంకితభావంతో సేవించడం వలన ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణతను సాధించడం జరుగుతుందని విశ్వసిస్తుంటారు.


More Bhakti News