అందుకే అమ్మవారిని అలా కొలుస్తుంటారు

రాజరాజేశ్వరీదేవి ఆరాధన ప్రాచీనకాలం నుంచి కనబడుతుంది. ఆ తల్లిని పూజించడం వలన విజయము చేకూరుతుంది ... సంపదలు పెరుగుతాయి. రాజరాజేశ్వరీదేవి పట్ల భక్తులకు గల విశ్వాసం అపారం. అందువల్లనే ఆ తల్లి కొలువైన ఆలయాలు భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తూ వుంటాయి. అమ్మవారి అనుగ్రహంతోనే సంతాన సౌభాగ్యాలు కాపాడబడుతున్నాయని విశ్వసిస్తుంటారు.

అలా అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటోన్న ఆలయాలలో ఒకటి 'బెంగుళూరు' లో దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు 'నిమిషాంబ' గా కూడా వ్యవహరిస్తూ వుంటారు. నిమిషాంబ రాజరాజేశ్వరీగా అమ్మవారు కొలువై వుండటం వెనుక ఆసక్తికరమైన పురాణకథనం వినిపిస్తూ వుంటుంది. గౌతమ మహర్షి లోక కల్యాణం కోసం ఈ ప్రదేశంలో ఒక యాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. అయితే ఆ యాగం పూర్తికాకుండా చేయాలనే ఉద్దేశంతో అసురులు ఆటంకాలు కల్పిస్తుంటారు.

అలాంటి పరిస్థితుల్లో గౌతమమహర్షి అమ్మవారిని ప్రార్ధించగా 'నిమిషం' లో అమ్మవారు అక్కడ ప్రత్యక్షమై అసురులను అంతం చేసిందట. ఈ కారణంగానే అమ్మవారిని నిమిషాంబ పేరుతో కొలుస్తుంటారు. అమ్మవారు ఎంత త్వరగా అనుగ్రహిస్తుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ వుంటుంది. అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉందనీ, కోరిన వెంటనే వరాల జల్లును కురిపిస్తుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News