ఎడమచేయి వాటం

సాధారణంగా మనం పవిత్రమైన పనులన్నీ కుడిచేత్తో చేస్తూ, అందుకు ఎడమచేయి సాయాన్ని మాత్రం తీసుకుంటూ వుంటాం. మరికొందరు తమ ఎడమచేయి వాటాన్ని అలవాటు ప్రకారం దైవకార్యాల్లోను చూపిస్తుంటారు. నిజానికి కొన్ని పనుల విషయంలో రెండు చేతులను సమానంగా ఉపయోగించినప్పటికీ, పూజాది కార్యక్రమాల విషయానికి వచ్చే సరికి కుడి చేయి మాత్రమే పవిత్రమైనదిగా భావిస్తుంటాం.

పూజలు చేయు సమయంలో శుచిగా ... పవిత్రంగా ఉండాలని పెద్దవాళ్లు మనకి చెబుతూ వచ్చారు. ఇక నోములు - వ్రతాల సమయంలో పూజలతో పాటు దానాలు కూడా ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎడమ చేయిని ఏమాత్రం వాడకూడదని శాస్త్రం చెబుతోంది. దానమేదైనప్పటికీ ఎడమ చేయితో చేయకూడదని అంటోంది. ఉద్దేశం మంచిదే అయినా ... పుణ్య కార్యమే అయినా ఎడమ చేయిని వుపయోగించి చేసినట్టయితే దాని వలన ఆశించిన ఫలితం లభించదు. పైగా పాపకార్యం చేసినట్టు అవుతుందని తెలుస్తోంది.

మరి భోజనం చేసే సమయంలో ఎంగిలి చేత్తో మంచినీళ్లు ఎలా తాగాలనే సందేహం చాలా మందికి రావచ్చు. అప్పుడు ఎడమ చేత్తో మంచినీళ్ల గ్లాసును పట్టుకుని కుడిచేయి మణికట్టుపై పెట్టుకుని తాగాలని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆశించిన పుణ్య ఫలాలు అందుకోవాలంటే కుడిచేతిని మాత్రమే ఉపయోగించాలనే నియమాన్ని గుర్తుపెట్టుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.


More Bhakti News