భగవంతుడిని ఇలా మెప్పించవచ్చు

భగవంతుడిని మెప్పించడంలో సేవ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఉత్తమమైన జన్మను పొందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. జీవితం ఎప్పుడు ఏ క్షణంలో రాలిపోతుందో తెలియదు కనుక, ఉన్న సమయంలోనే వీలైనంత సేవచేయమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సేవ నిస్వార్థమైనదై వుండాలి ... సేవచేసే అదృష్టాన్ని భగవంతుడు తనకి కలిగించాడనే భావనతో వుండాలి. అప్పుడు కలిగే సంతోషం వేరు ... సంతృప్తి వేరు.

అనాథ పిల్లలకు ... అనాథ వృద్ధులకు తమవంతు సేవను అందిస్తూ వుండాలి. ఆపదలో వున్నవారినీ ... అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఆదుకుంటూ వుండాలి. ఇక దైవ సంబంధమైన సేవా కార్యక్రమాలపైనా దృష్టిపెట్టాలి. నిత్య ధూప దీప నైవేద్యాలకి నోచుకోని ఆలయాలు ఎన్నో వున్నాయి. నలుగురిని కలుపుకోనైనా అవి జరిపించే ప్రయత్నం చేయాలి.

భగవంతుడి ఉత్సవాలకి శ్రమపరంగాను ... ఆర్ధికపరంగాను సేవలో పాల్గొనాలి. స్వామివారి కల్యాణోత్సవాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, పానకం ... వడపప్పు పంచడం వంటివి చేయాలి. నలుగురితో కలిసిగానీ ... పూర్తిఖర్చుతో గాని అన్నదానాలు జరిపించాలి. కొన్ని ఆలయాలు గోశాలలను కూడా నిర్వహిస్తూ వుంటాయి. భగవంతుడికి అవసరమైన అభిషేకాలు ... నైవేద్యాల కోసం ఈ పాలను ఉపయోగిస్తూ వుంటారు. అలాంటి గోవుల ఆహారానికయ్యే ఖర్చులో, తమకి తోచినంత భరించడానికి ఆసక్తిని చూపించాలి.

ఇక గోశాల లేని ఆలయాలో, స్వామివారికి అభిషేకానికీ ... నైవేద్యానికి అవసరమైన ఖర్చుకుగాను ఆర్ధికసాయాన్ని అందించవచ్చు. ఇలా మంచి మనసుతో నిస్సహాయులను ఆదుకోవడం వలన ... గోసేవ చేసుకోవడం వలన ... భగవంతుడి సేవలో పాల్గొనడం వలన అనేక దోషాలు నశించి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. అలాంటివారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, వారి సేవా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ భగవంతుడు కనిపెట్టుకునే ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News