పాదరక్షలు

పాదరక్షలు ఎంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ ... వాటిపై ఎంతగా మనసు పడినప్పటికీ అవి వుండవలసినది గుమ్మం బయట మాత్రమేనని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే పాదరక్షలను చేతులతో పట్టుకున్నా ... ఇంట్లోకి తీసుకు వచ్చినా జ్యేష్టా దేవికి ఆహ్వానం పలికినట్టు అవుతుందని అంటుంటారు. ఈ కారణంగానే దైవకార్యాలు ... శుభకార్యాలు జరుగుతున్న ప్రదేశానికి పాదరక్షలతో రానీయకపోవడం ఆచారంగా వస్తోంది.

అయితే ఇప్పుడు పాదరక్షల విషయంలో పాటించవలసిన పద్ధతులను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆధునిక కాలంలో ఇంట్లో కూడా పాదరక్షలు ధరించి తిరగడమనేది అలవాటుగా మారిపోయింది. మంచం దగ్గరే పాదరక్షలు విడవడం ... దిగుతూనే పాదరక్షలు ధరించి ఇల్లంతా తిరగడం చేస్తుంటారు. పాదరక్షల విషయంలో ఈ విధంగా ప్రవర్తించడాన్ని శాస్త్రం తప్పుపడుతోంది.

పాదరక్షలు ధరించి బయట ఎక్కడెక్కడో తిరిగి ఇల్లు చేరుకుంటాం. ఈ లోగా వీధుల్లో దాటరానివి దాటుకుంటూ, తొక్కరానివి తొక్కుకుంటూ వచ్చేస్తాం. మట్టిలో కలిసివుండే పిశాచ గణాలు ధూళి రూపంలో పాదరక్షలకు అంటుకుని మనతోపాటే ఇంట్లోకి వచ్చేస్తాయి. అలా వచ్చింది మొదలు అవి ఆ ఇంట్లోవారికి మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి.

ఇక పాదరక్షలతో అనేక సూక్ష్మ జీవులు ఇంట్లోకి రావడం వలన అందరూ అనారోగ్యాలకి గురవుతారు. ఇటు దుష్ట శక్తుల బారి నుంచి ... అటు అనారోగ్యానికి దారి తీసే పరిస్థితుల నుంచి బయట పడటానికే పాదరక్షలు ఇంటి బయటమాత్రమే వుండాలని పెద్దలు చెప్పారు.


More Bhakti News