పిలిస్తే పలికే సాయినాథుడు

సద్గురువు సమానత్వాన్ని చాటుతాడు ... మానవత్వాన్ని పెంచుతాడు. అసూయద్వేషాలు విడనాడి, అంతా సఖ్యతగా ... సంతోషంగా ఉండేలా కృషిచేస్తాడు. అజ్ఞానాంధకారాన్ని తరిమేసి సన్మార్గంలో నడిపిస్తాడు. తనని విశ్వసించినవారి బాధ్యతను తాను స్వీకరించి అడుగడుగునా వాళ్లను రక్షిస్తూ వుంటాడు. అలాంటి సద్గురువు సాయిబాబా కావడం వల్లనే ఈ రోజున శిరిడీలోనే కాదు, ప్రతి గ్రామంలోను ఆయన హారతులు ... భజనలు కనిపిస్తున్నాయి.

అలా ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోన్న బాబా ఆలయాలలో ఒకటి నల్గొండ జిల్లా 'చౌటుప్పల్' లో దర్శనమిస్తుంది. అపారమైనటువంటి భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా ఈ ఆలయం కనిపిస్తూ వుంటుంది. అందంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం పవిత్రతకు అద్దంపడుతూ, దర్శనమాత్రం చేతనే మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తూ వుంటుంది. ఇక్కడి బాబాను ఒక్కసారి దర్శిస్తేచాలు మనోఫలకంపై ఎప్పటికీ నిలిచిపోతాడు.

బాబా దర్శనమే ధైర్యాన్ని వరంగా అందిస్తూ వుంటుంది. ఆయన చిరునవ్వే అభయాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. అందువల్లనే ఆయనని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. ప్రతి గురువారం బాబాకి ప్రత్యేక సేవలు ... భజనలు జరుపుతుంటారు. అందువలన ఇక్కడ ఎంతో సందడిగా పండుగ వాతావరణం నెలకొని వుంటుంది. ఆర్తితో పిలిచిందే తడవుగా బాబా ఆదుకుంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

అనారోగ్య సమస్యలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు .. ఇలా బాబాతో ఏ కష్టం చెప్పుకున్నా ఆయన అనుగ్రహంతో అవి వెంటనే తీరిపోతాయని అంటారు. బాబా పాదాలను ఆశ్రయించినవారిని ఆపదలు దరిచేరవనీ, వాళ్లకి ప్రశాంతమైన జీవితం లభిస్తుందని చెబుతుంటారు. అందువల్లనే బాబా ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తూ వుంటుంది. ప్రతి భక్తుడి అనుభవం బాబా మహిమగా వినిపిస్తూ వుంటుంది.


More Bhakti News