అర్జునుడి మనసును చలింపజేసిందెవరు ?

అరణ్యవాస కాలంలో ద్రౌపది - ధర్మరాజు ఏకాంతంగా వున్న సమయంలో, గోబ్రాహ్మణ రక్షణార్థం తన విల్లుకోసం ఆ వైపుకి వెళతాడు అర్జునుడు. అది వాళ్లు ఏర్పరచుకున్న నియమాన్ని ఉల్లంఘించడమే. ఆ పాపానికి పరిహారంగా అనేక క్షేత్రాలను దర్శించాలనీ, తీర్థాలలో స్నానమాచరించాలని అర్జునుడు నిర్ణయించుకుంటాడు. అందుకోసం 'భూప్రదక్షిణ' చేయడానికి బయలుదేరుతాడు.

అలా అక్కడి నుంచి బయలుదేరిన అర్జునుడు, అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ మణిపుర రాజ్యానికి చేరుకుంటాడు. అక్కడే అతనికి మణిపుర మహారాజు కూతురైన 'చిత్రాంగద' తారసపడుతుంది. అర్జునుడి శౌర్య పరాక్రమాలను గురించి విన్న చిత్రాంగద, మనోహరమైన ఆయన రూపురేఖలను ప్రత్యక్షంగా చూసి మనసు పారేసుకుంటుంది. ఆయననే భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. ఇక చిత్రాంగద సౌందర్య విశేషం అర్జునుడిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎదుటివారి మనసును ఎంతమాత్రం నొప్పించని ఆమె మాటతీరు ఆయనని కట్టిపడేస్తుంది.

ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకున్న మణిపుర మహారాజు, వైభవంగా వారికి వివాహాన్ని జరిపిస్తాడు. చిత్రాంగద కోరికమేరకు కొంతకాలం పాటు అర్జునుడు అక్కడే వుంటాడు. చిత్రాంగద కోరుకున్నట్టుగానే అర్జునుడి ద్వారా ఆమెకి ఒక మగబిడ్డ కలుగుతాడు. తండ్రి మాదిరిగానే శౌర్యపరాక్రమాల విషయంలో ఎంతమాత్రం వెనుకడుగువేయని ఆ వీరుడే 'బబ్రు వాహనుడు'.


More Bhakti News