విజయాన్ని చేకూర్చే ఆంజనేయుడు

ఒక విజయం మరిన్ని విజయాలను సాధించడానికి అవసరమైన శక్తిని ప్రసాదిస్తుంది. అలా విజయాలు సాధిస్తూ వెళుతూ వుంటే సిరిసంపదలు ... కీర్తిప్రతిష్ఠలు వెంటే వస్తుంటాయి. అందుకే ప్రతిఒక్కరూ విజయానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ వుంటారు. ఆ విజయాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతగానో శ్రమిస్తుంటారు. అయితే కొంతమందితో విజయమనేది దోబూచులాడుతూ వుంటుంది. ఎంతగా కృషిచేస్తూ వున్నా అది అందకుండా పోతుంటుంది.

దాంతో వాళ్లు మానసికంగా కుంగిపోతుంటారు. తమకి విజయం చేకూరేలా చేయమని దైవదర్శనాలు చేస్తుంటారు. కృషితోపాటు దైవబలం కూడా ఉన్నప్పుడే విజయం చేకూరుతుందని నమ్ముతుంటారు. అలాంటివారికి విజయాలను ప్రసాదించే క్షేత్రంగా 'తాడేపల్లి' కనిపిస్తుంది. కృష్ణాజిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో హనుమంతుడు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. చాలాకాలంగా ఇక్కడ కొలువై వున్న హనుమంతుడు, ఎంతోమంది భక్తుల విశ్వాసాన్ని చూరగొన్నాడు.

భక్తుల ధర్మబద్ధమైన కోరికలను స్వామివారు వెంటనే నెరవేరుస్తాడని చెప్పడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. ఆంజనేయుడి మహిమలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. ప్రతి మంగళ - శనివారాల్లో స్వామివారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి హనుమంతుడికి పూజాభిషేకాలు జరిపించడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ ... అనారోగ్యాలు నివారించబడతాయని చెబుతారు.

ఆయన ఆశీస్సులు అందుకుని ఆరంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయాలను అందిస్తాయని అంటారు. తన పాదాలను ఆశ్రయించిన భక్తులకు ఎలాంటి పరిస్థితుల్లోను స్వామివారు అసంతృప్తిని కలిగించడని చెబుతుంటారు. ఆయన అనుగ్రహాన్ని పొందకుండా ఎవరూ వెనుదిరగరనే బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు.


More Bhakti News