దత్తాత్రేయస్వామి ఆరాధనా ఫలితం

త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు వివిధ వేషధారణలతో ... అనేక రూపాలలో తిరుగాడుతూ వుంటాడు. అలా ఆయన తన భక్తులను పరీక్షిస్తూ వాళ్లను అనుగ్రహిస్తూ వుంటాడు. ఎవరైతే తనపట్ల అచెంచలమైన విశ్వాసాన్ని కలిగివుంటారో, ఎవరైతే ఇతర జీవులపట్ల ప్రేమభావాన్ని కలిగివుంటారో అలాంటివారిపై ఆయన కరుణాకటాక్షాలను చూపుతుంటాడు. మానవత్వం వున్నవారిపైనే ఆయన తన చూపును నిలుపుతుంటాడు.

ఇక అహంభావం అనే మాటకు ... మనుషులకు స్వామి దూరంగా ఉంటాడు. అలాంటివాళ్లు ఆయన పరీక్షలకు నిలవగలిగితే చాలు. అజ్ఞానమే అహంభావానికి పునాది కాబట్టి, వాళ్లకి జ్ఞానభిక్షను పెట్టి సరైన మార్గాన్ని చూపుతాడు. జీవితాన్ని అతలాకుతలం చేసేవి పూర్వజన్మలో చేసుకున్న పాపాలు. ఆ పాపాల ఫలితంగానే భగవంతుడి పాదాలపై దృష్టి నిలపలేకపోవడం జరుగుతూ వుంటుంది. ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతూ వుంటాయి. దుష్టశక్తుల బారినపడటం జరుగుతూ వుంటుంది.

ఇలా మనశ్శాంతి కరువైనవాళ్లు అనునిత్యం దత్తాత్రేయస్వామిని ఆరాధిస్తేచాలు ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది. పూజా మందిరంలో దత్తాత్రేయస్వామి చిత్రపటాన్నిగానీ, ప్రతిమనుగాని ఏర్పాటు చేసుకుని అనునిత్యం ఆ స్వామిని ఆరాధిస్తూ వుండాలి. ఆయనకి ఎంతో ఇష్టమైన అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ వుండాలి. నియమనిష్ఠలతో దత్తాత్రేయ స్తోత్రం పఠిస్తూ ... గురుచరిత్రను పారాయణ చేస్తూ వుండాలి. అవకాశం వున్నప్పుడు దత్తాక్షేత్రాలను దర్శిస్తూ వుండాలి. ఎవరినీ తక్కువగా చూడకుండా వున్న దాంట్లోనే ఇతరులకు సాయం చేస్తూ వుండాలి. ఈవిధంగా చేయడం వలన దత్తాత్రేయస్వామి కరుణాకటాక్షాలు అనతికాలంలోనే లభిస్తాయి. ఆయన అడుగుపెట్టినచోట అన్నిరకాల బాధలు అదృశ్యమైపోతాయి.


More Bhakti News