మాఘపౌర్ణమి ప్రత్యేకత అదే !

సహజంగానే ప్రతిమాసంలోను సాధారణమైన రోజులకంటే 'పౌర్ణమి' తిథి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈరోజున కొన్ని పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు ... సేవలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వైశాఖమాసంలోను ... కార్తీకమాసంలోను ... మాఘమాసంలోను వచ్చే 'పౌర్ణమి' తిథులు మరింత విశేషాన్ని కలిగినవిగా చెప్పబడుతున్నాయి.

సాధారణమైన రోజుల్లో చేసే పూజలు ... పుణ్యకార్యాలు ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పౌర్ణమి రోజున చేయబడే పుణ్యకార్యాలు మరింత విశేషమైన పుణ్యఫలాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'మాఘపౌర్ణమి' రోజున చేసే స్నానం .. పూజ .. దానం అనంతమైన ఫలితాలను అందిస్తాయని చెప్పబడుతోంది.

భక్తిశ్రద్ధలతో చేయబడే పూజాభిషేకాల వలన, స్నానము - దానము చేయడం వలన విశేషమైన ఫలితాలను ప్రసాదించే విశిష్టమైన మాసంగా మాఘమాసం చెప్పబడుతోంది. ఈ మాసమంతా తెల్లవారు జామునే నిద్రలేచి నదీస్నానం చేసి ... శ్రీమన్నారాయణుడిని పూజించి ... శక్తికొద్దీ దానం చేయడం మంచిదని చెబుతారు. అనారోగ్యాల వలనగానీ ... ఇతర కారణాల వలన గాని అవి చేయలేనివారికి 'పౌర్ణమి' తిథి ఒక వరం వంటిదని అంటారు.

మాఘపౌర్ణమి రోజున చేసే స్నానం ... దైవారాధన ... దానం, ఆ మాసమంతా అవి చేసిన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది. ఇక ఈరోజునే కొన్నిక్షేత్రాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలలోను ... నరసింహస్వామి ఆలయాలలోను కల్యాణ మహోత్సవాలు జరుపుతుంటారు. అందువలన అక్కడ సందడి వాతావరణం నెలకొని వుంటుంది. మాఘమాసంలో పౌర్ణమి రోజున జరిగే స్వామివారి కల్యానోత్సవాన్ని తిలకించడం వలన కూడా అనంతమైన పుణ్యఫలాలు అక్కునచేరతాయి. అందువలన ఈరోజున స్వామివారి కల్యాణోత్సవం చూడటానికి భక్తులు పెద్దసంఖ్యలో ఆయా క్షేత్రాలకి తరలివెళుతుంటారు. ఇలా స్నానము ... దానము ... క్షేత్రదర్శనంతో పుణ్యఫలాలను అందించే విశిష్టతను సంతరించుకున్నదిగా మాఘపౌర్ణమి కనిపిస్తుంది.


More Bhakti News