కోరిన వరాలను ప్రసాదించే దివ్యక్షేత్రం

ఏ దేవాలయానికైనా వెళితే దాని వైశాల్యాన్ని బట్టి ... నిర్మాణాన్ని బట్టి ... అక్కడి దేవతా మూర్తులను బట్టి అది ప్రాచీనకాలంనాటిదనే విషయం అర్థమైపోతుంటుంది. అలా అడుగుపెడుతుండగానే అది ప్రాచీనకాలంనాటి క్షేత్రమనీ, ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొంది ఉంటుందనే ఆలోచన కలిగించే క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'వేమూరు'లో దర్శనమిస్తుంది.

ఒకవైపున పౌరాణిక నేపథ్యం ... మరొక వైపున చారిత్రక వైభవాన్ని కలిగినదిగా గుంటూరు జిల్లా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ జిల్లాలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు అలరారుతున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'వేమూరు' ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సువిశాలమైనటువంటి ఒకే ప్రాంగణంలో రామాలయం .. శివాలయం ... వేణుగోపాలస్వామి ఆలయం ... హనుమంతుడి ఆలయం దర్శనమిస్తూ వుంటాయి.

ప్రతి ఆలయం కూడా భారీ నిర్మాణాన్ని కలిగి వుండి వైభవంతో విలసిల్లుతూ వుండటం ఇక్కడి ప్రత్యేకత. ఎంతోమంది మహాభక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి తరించారని చెబుతుంటారు. ఇక్కడి సీతారాములను పూజిస్తే వివాహయోగం కలుగుతుందనీ, శివుడిని ఆరాధిస్తే సౌభాగ్యసిద్ధి కలుగుతుందనీ, వేణుగోపాలుడిని సేవిస్తే సంతానభాగ్యం కలుగుతుందని .. హనుమంతుడిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు లభిస్తాయని విశ్వసిస్తుంటారు.

అందువలన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడం వలన తప్పక మనోభీష్టం నెరవేరుతుందని అంటారు. శివకేశవులు కొలువైన కారణంగా, అన్ని పర్వదినాల్లోను ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. మానసిక ప్రశాంతతతో పాటు కోరిన వరాలను ప్రసాదించే ఈ క్షేత్రం తమకు లభించిన 'అక్షయపాత్ర' వంటిదని భక్తులు ఆనందంగా చెబుతుంటారు.


More Bhakti News