మట్టి శివలింగం నుంచి వచ్చిన మహేశ్వరుడు

ద్వాదశ జ్యోతిర్లింగాలలో 'పూనా' సమీపంలోగల 'భీమశంకరం' ఒకటిగా చెప్పబడుతోంది. స్వామి ఇక్కడ ఈ పేరుతో వెలుగొందడం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. వాటిలో 'భీముడు' అనే రాక్షసుడికి సంబంధించిన కథనం కూడా ఒకటిగా కనిపిస్తుంది. వరబల గర్వంతో భీముడు సాధుసజ్జనులను అనేక విధాలుగా వేధించసాగాడు.

అందులో భాగంగానే శివభక్తుడైన 'కామరూపేశ్వర్' అనే రాజును బంధిస్తాడు. ఇకపై శివుడిని పూజించడం మానుకోమని హెచ్చరిస్తాడు. అందుకు ఎంతమాత్రం భయపడని ఆ రాజు, అక్కడే మట్టితో శివలింగాన్ని తయారు చేసుకుని అనునిత్యం పూజిస్తూ వుంటాడు. రాజుకి శిక్ష ఎలా అమలు జరుగుతుందో తెలుసుకోవడం కోసం, కొంతకాలం తరువాత భీముడు అక్కడికి వస్తాడు.

ఆ సమయంలో ఆ రాజు మట్టితో చేయబడిన శివలింగాన్ని ఆరాధిస్తూ వుండటం చూసి ఆగ్రహావేశాలకి లోనవుతాడు. పూజలో వున్న రాజుపైకి కోపంతో కత్తిని విసురుతాడు. నేరుగా వెళ్లిన ఆ కత్తి, మట్టితో చేయబడిన శివలింగానికి తాకుతుంది. అంతే ఆ శివలింగంలో నుంచి వచ్చిన పరమశివుడు, భీముడిని అక్కడే సంహరిస్తాడు. చివరినిముషంలో భీముడు అభ్యర్థించడంతో, ఆయన పేరును కలుపుకుని ఈ క్షేత్రం విలసిల్లుతుందని అనుగ్రహిస్తాడు.

ఈ సంఘటన తరువాత ఇక్కడ వెలసిన శంకరుడు ... భీమశంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. అలా ఈ క్షేత్రానికి భీమశంకరమనే పేరు వచ్చిందని అంటారు. మహిమాన్వితమైన ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం వలన, ఎలాంటి బాధల నుంచైనా విముక్తి కలుగుతుందని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News