గురుశిష్యుల అనుబంధమంటే అదే !

గురువును ఆశ్రయించడం వలన మాత్రమే అజ్ఞానమనే చీకటి తొలగిపోతుంది. గురువును విశ్వసించడం వలన మాత్రమే కనిపించే వెలుగు .. ప్రయాణ మార్గాన్ని సూచిస్తుంది. ఆ మార్గంవైపు అడుగువేసినప్పుడే అనుకున్న గమ్యానికి చేరడం జరుగుతుంది. లక్ష్యాన్ని సాధించడం జరుగుతుంది. అలా గురువుపట్ల అపారమైన విశ్వాసం కలిగిన శిష్యుడిగా సిద్ధయ్య, శిష్యుడి పట్ల అనంతమైన అభిమానమున్న గురువుగా వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనమిస్తూ వుంటారు.

సిద్ధయ్యను చూడగానే ఆయన కారణజన్ముడనే విషయం బ్రహ్మంగారికి అర్థమైపోతుంది. అలాగే వీరబ్రహ్మేంద్రస్వామి తారసపడగానే తాను ప్రయాణించవలసిన మార్గం ఏమిటనేది సిద్ధయ్యకి తెలిసిపోయింది. అందుకే ఆ ఇద్దరి అనుబంధం సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఎన్నో ప్రాంతాలను ఇద్దరూ కలిసి దర్శించారు. గురువును ప్రేమతో సేవించడం వలన ఆ శిష్యుడు ఎంతటి శక్తిమంతుడు అవుతాడనడానికి నిలువెత్తు నిదర్శనంగా సిద్ధయ్యను చెప్పుకోవచ్చు. ఆయన మహిమలు చూసినవాళ్లు వీరబ్రహ్మేంద్రస్వామి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఊహించగలిగారు.

గురువు మాటను వేదంలా భావించడం ... ఆయన ఆదేశించి పని ఏదైనా అసాధ్యమని అనుకోకుండా ఆచరణలో పెట్టడం సిద్ధయ్యలో కనిపిస్తుంది. అందుకే బ్రహ్మంగారు తన తరువాత కాలజ్ఞానాన్ని ప్రచారంచేసే బాధ్యతను సిద్ధయ్యకి అప్పగించాడు. తన పాదుకలు .. యోగదండం .. అంగుళీయకం సిద్ధయ్యకి అందజేశాడు. ఇక బ్రహ్మంగారు సజీవంగా వున్నప్పుడు సిద్దయ్య ఎంతటి భక్తి విశ్వాసాలను ప్రదర్శించాడో, ఆయన జీవ సమాధిచెందిన తరువాత కాలంలో కూడా అదే భక్తివిశ్వాసాలను కనబరిచాడు. గురుశిష్యులుగా వారి అనుబంధం అంతటి బలమైనది ... తరతరాలుగా అది అందరికీ ఆదర్శప్రాయమైంది.


More Bhakti News