దుఃఖమనేది ఇలా దూరమవుతుంది

నిప్పుని తెలిసితాకినా తెలియక తాకినా కాలుతుంది. అలాగే తెలిసిచేసినా తెలియకచేసినా పాపమనేది నీడలా వెంటాడుతూనే వుంటుంది. దానికి రుతువులతోగానీ ... కాలాలతోగాని ఎలాంటి సంబంధం లేదు. ఆ తరువాత జన్మలలోను విడువకుండా అది అనుసరిస్తూనే వుంటుంది. ఇక తెలిసి ఎలాంటి పాపం చేయకుండా జాగ్రత్తపడుతూ భగవంతుడి పాదాలను ఆశ్రయించడం వలన, దానధర్మాలు చేస్తూ పుణ్యరాశిని పెంచడం వలన గతజన్మల పాపాల బారినుంచి కొంతవరకూ ఉపశమనం లభిస్తుంది.

అహంకారంతో వ్యవహరిస్తూ గతంలో చేసిన పాపాల కారణంగానే, ఈ జన్మలో అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు కలుగుతుంటాయి. ఒకవైపున చికిత్సకి లొంగని అనారోగ్య సమస్యలు ... మరోవైపున అవసరాలు తీరని దారిద్ర్యం ఎంతటి వారినైనా మానసికంగా కుంగదీస్తుంటాయి. అందరూ వున్నా ఎవరూ తీర్చలేనిదిగా ఈ పరిస్థితి తీవ్రమైన దుఃఖానికి గురిచేస్తూ వుంటుంది.

ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి 'స్పటిక శివలింగ' ఆరాధన ఉత్తమమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడి మనసును గెలుచుకోవడంలో స్పటిక శివలింగ పూజ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. సాధారణంగా నల్లరాయితోను ... తెల్లరాయితోను మలచబడిన శివలింగాలు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. స్వచ్ఛమైన స్పటిక శివలింగాలు కాస్త అరుదుగానే కనిపిస్తుంటాయి.

ఒక్కో శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే స్పటిక శివలింగం కూడా తనదైన విశిష్టతను చాటుతూ వుంటుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో స్పటిక శివలింగానికి పూజాభిషేకాలు జరుపుతూ వుండటం వలన, పాపాల ఫలితంగా వెంటాడుతోన్న దారిద్ర్యం ... దానివలన కలుగుతోన్న దుఃఖాలు దూరమవుతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News