విశేషమైన ఫలితాలను ఇచ్చే రుద్రాక్ష !

రుద్రాక్షలు ధరించడం ... రుద్రాక్షమాలతో జపం చేయడమనేది ప్రాచీనకాలం నుంచి కనిపిస్తుంది. మహర్షులు ... మునీశ్వరులు ... ఆధ్యాత్మిక చింతన కలిగిన మహారాజులు సైతం అప్పట్లో రుద్రాక్షలు ధరించేవారు. శిరస్సున ... మెడలోను ... చేతి జబ్బలకు ... ముంజేతికి రుద్రాక్షధారణ జరిగేది. శరీరభాగాలలో ఒక్కోచోట ఒక్కోసంఖ్యతో రుద్రాక్షలను ధరించడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయనే విశ్వాసం ఆనాటి నుంచీ వుంది.

రుద్రాక్షలలో వివిధరకాల ముఖాలు కలిగినవి కనిపిస్తుంటాయి. వీటిలో ఒక్కోరకమైన రుద్రాక్ష ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుందని శాస్త్రం చెబుతోంది. అయితే వీటిలో కొన్నిరకాల రుద్రాక్షలు తేలికగా లభిస్తుంటాయి. మరికొన్ని రుద్రాక్షలు అరుదుగా మాత్రమే దొరుకుతుంటాయి. ఒక్కో రుద్రాక్ష ఒక్కో దైవస్వరూపానికి సంకేతంగా చెప్పబడుతూ వుంటుంది.

రుద్రాక్షకిగల గుణాన్ని బట్టి ... దానిని పవిత్రంగా చూసుకునే విధానాన్ని బట్టి అది ప్రభావం చూపుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అనారోగ్యాల నుంచి ఆర్ధికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడేసేవిగా, దుష్టశక్తుల బారినుంచి కాపాడేవిగా ... మనోభీష్టం నెరవేర్చేవిగా రుద్రాక్షలు కనిపిస్తుంటాయి.

అయితే ఏ రుద్రాక్ష నుంచైనా ఆశించిన ప్రయోజనాన్ని పొందాలంటే, అది సహజమైనదా ... నకిలీదా ? అనే విషయాన్ని తెలుసుకుని ధరించవలసి వుంటుంది. సహజసిద్ధంగా లభించిన రుద్రాక్ష నీటిలో వేస్తే మునిగిపోతుంది ... తయారుచేయబడిన రుద్రాక్ష నీటిలో వేస్తే తేలుతుంది. ఇలా నిర్ధారణ చేసుకుని సహజసిద్ధమైన రుద్రాక్షలను మంత్రపూర్వకంగా ధరించించడం వలన ... నియమనిష్టలతో చూసుకోవడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు.


More Bhakti News