అదే ఇక్కడి శివలింగం విశేషం !

శివుడు కొలువుదీరిన కొన్నిక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయన 'రామలింగేశ్వరుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ కనిపిస్తాడు. రామలింగేశ్వరుడు అనే పేరు వినగానే అక్కడ స్వామిని శ్రీరాముడు ప్రతిష్ఠించాడనే విషయం భక్తులకు అర్థమైపోతుంటుంది.

రావణుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి శ్రీరాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ... పూజిస్తూ వెళ్లాడు. ఆ ప్రదేశాలు నేడు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతుండగా వాటిలో 'ప్రొద్దుటూరు' ఒకటిగా కనిపిస్తుంది. కడపజిల్లా పరిధిలో గల విశిష్టమైన క్షేత్రాల్లో ఇదొకటిగా దర్శనమిస్తుంది.

రాముడు శివలింగ ప్రతిష్ఠకు పూనుకోగా, శివలింగం కోసం వెళ్లిన హనుమంతుడు ఆలస్యంగావస్తాడు. ఈలోగా రాముడు ఇసుకతో చేయబడిన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ తరువాత హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా అదే ప్రదేశంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ కథనం కొన్ని క్షేత్రాల్లో వినిపిస్తూ వున్నప్పటికీ ఇక్కడి స్థలమహాత్మ్యం వేరు.

ఇసుకతో చేయబడిన శివలింగంపై శ్రీరాముడివిగా చెప్పబడుతోన్న చేతివ్రేళ్ల గుర్తులు ఇప్పటికీ ఉండటం ఇక్కడి విశేషం. రామలింగేశ్వరుడిపై రాముడి చేతివ్రేళ్ల గుర్తులు చూసినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి శివలింగంపై రాముడి చేతి వ్రేళ్ల గుర్తులు ఇప్పటికీ కనిపిస్తూ వుండటం ... హనుమంతుడి కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఆయన పేరుతో పూజలందుకుంటూ వుండటం ... భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తూ వుండటం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.


More Bhakti News