ఆకులో ఆహారం

వివాహాది శుభకార్యాలలో భోజనాలు అరటి ఆకుల్లో పెట్టే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇప్పుడంటే వంటచేసే ఓపిక ... వడ్డించే తీరిక లేదని చెప్పేసి అంతా క్యాటరింగ్ భోజనాలపై ఆధారపడుతున్నారు గానీ, ఒకప్పుడు అంతా అరటి ఆకుల్లోనే భోజనాన్ని వడ్డించేవారు. ఇప్పుడు కూడా అక్కడక్కడా ఈ సంప్రదాయాన్ని ఆచరించే వారు లేకపోలేదు.

ఇక గుడిలో ప్రసాదం కూడా అప్పట్లో మర్రి ఆకుల్లోగానీ ... మోదుగ ఆకుల్లోగాని పెట్టేవారు. ఇప్పుడు వీటి స్థానంలో పేపర్ ప్లేట్లు ... ప్లాస్టిక్ కప్పులు చోటుచేసుకున్నాయి. భోజనం చేయడానికి ఏ ప్లేట్ అయితే ఏ వుందీ ... అది శుభ్రంగా ఉండాలిగానీ అని అనుకుంటూ వుంటారు. గుడిలో ప్రసాదాలకి సంబంధించిన విషయాల్లోనూ అలాగే వ్యవహరిస్తుంటారు. కానీ ఆకుల్లో తినడమనే ఆచారం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు దాగి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.

అరటి ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ, దానిలో భోజనం చేయడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మోదుగ ఆకులో తినడం వలన కంటి దోషాలు తొలగిపోతాయనీ, రావి ఆకులో తినడం వలన జననేంద్రియ దోషాలు దూరమవుతాయని తెలుస్తోంది. మర్రి ఆకుల్లో తినడం వలన మరింత ఆరోగ్యవంతులవుతారనేది పెద్దలమాట.

ఆకుల్లోని ఆహారం ఆరగించడం వలన కడుపులోని క్రిములను కడిగిపారేసినట్టు అవుతుందట. అందువలన ఆహారం విషయంలో ఆధునీకతను ఓ పక్కన పెట్టేసి, వీలైనంత వరకూ ఆకుల్లో ఆహారం తీసుకోవడం అందరికీ శ్రేయస్కరం.


More Bhakti News