మేడారం జాతర

మంచి కోసం ... తమ చుట్టూ ఉన్న మనుషుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారు, అందరి హృదయాల్లోనూ ... అరుదైన చరిత్రలోను దైవాలుగా నిలిచి పూజలు అందుకుంటోన్న దాఖలాలు ఎన్నో వున్నాయి. అలాంటి వారిలో 'సమ్మక్క - సారలమ్మ'ల పేర్లు ముందు వరుసలో కనిపిస్తాయి.

'మేడారం'ప్రాంతంలోని ప్రజల గుండెల్లో వీరిద్దరూ దైవాలుగా వెలుగొందడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే ... 13 వ శతాబ్దంలో 'ఓరుగల్లు'ప్రతాపరుద్రుడి ఏలుబడిలో ఉంది. ఆ సమయంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంత రాజైన 'పగిడిద్ద రాజు' పాలించేవాడు. ఆయన భార్య సమ్మక్క ... వారి సంతానమే సారలమ్మ ... నాగులమ్మ ... జంపన్న.

కాకతీయులకు వారి సామంతులు కప్పం కట్టాల్సి వుంటుంది. అయితే ఆ సంవత్సరం మేడారం ప్రాంతంలో కరువు కాటకాలు ఏర్పడటం వలన కప్పం చెల్లించలేక పోయారు. పగిడిద్ద రాజు కాకతీయ ప్రభువులకు పరిస్థితిని వివరించినా ప్రయోజనం లేకపోయింది. కయ్యానికి కాలుదువ్వుతూ ప్రభుత్వ సైన్యం మేడారం వైపు కదిలింది. దాంతో తాడో పేడో తేల్చుకునేందుకు పగిడిద్ద రాజు నేతృత్వంలో గిరిజనులు ముందుకు కదిలారు.

పగిడిద్ద రాజుతో పాటు ఆయన కుమార్తెలు సారలమ్మ ... నాగులమ్మ ... కొడుకు జంపన్న ... అల్లుడు గోవిందరాజు కూడా పోరుబాటలో ముందుకు నడిచారు. అంతా కలిసి ప్రభుత్వ సైన్యాన్ని 'సంపెంగ వాగు' దగ్గర నిలువరించారు. సింహాల్లా విరుచుకుపడి వీరపోరాటం చేశారు. అయితే క్రమేణా వారికి ఆయుధాల కొరత ఏర్పడటం మొదలైంది ... వీరులంతా ఒక్కొక్కరుగా నేలకొ రుగుతున్నారు.

పగిడిద్ద రాజు ... సారలమ్మ ... నాగులమ్మ ... వీర మరణాన్ని పొందారు. శత్రువుల చేతికి చిక్కకుండా జంపన్న సపెంగ వాగులో దూకేశాడు. విషయం తెలుసుకున్న సమ్మక్క మరి కొంత సైన్యంతో యుద్ధభూమికి చేరుకుంది. శత్రువులను చీల్చిఛండాటం మొదలుపెట్టింది. ఆమెను నేరుగా ఎదుర్కోలేకపోయిన సైనికులు దొంగ దెబ్బతీసి గాయపరిచారు. దాంతో తీవ్రమైన గాయాలతో సమ్మక్క మేడారం ప్రాంతంలోని 'చిలక గుట్ట' వైపు వెళ్లి అదృశ్య మైంది.

సమ్మక్క కోసం గిరిజనులు ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఆకాశవాణి ఆ గిరిజనులను ఉద్దేశించి 'సమ్మక్క - సారలమ్మ'ల పేరిట రెండు గద్దెలు నిర్మించి, రెండేళ్ల కోసారి ఉత్సవాలు జరిపితే కోరిన కోరికలు నెరవేరతాయని పలికింది. అది సమ్మక్క స్వరంగా గుర్తించిన గిరిజనులు ఆమె చెప్పినట్టుగానే చేశారు. ఆ రోజు నుంచి సమ్మక్క - సారలమ్మలు దేవతలుగా పూజలందుకుంటున్నారు.

మాఘ శుద్ధ పౌర్ణమి రోజున రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. తమ కోరికలు నెరవేరడం కోసం బెల్లం (బంగారం )దిమ్మలను ... కోడె దూడలను ... తల నీలాలను ... సమర్పించుకుంటూ వుంటారు. ఒకప్పుడు పూర్తి అటవీ ప్రాంతంగా వుండే ఈ ప్రదేశం, ఇప్పుడు భక్తులు సందర్శించడానికి అనుకూలంగా మారిపోయింది. ఈ నాలుగు రోజులపాటు అక్కడ పండుగ వాతావరణం చోటుచేసుకుంటుంది. తెలంగాణా ప్రజల భక్తి విశ్వాసాలు ... అక్కడ వారు చేసే సందళ్లు చూడాలంటే మేడారం జాతరకి వెళ్లాల్సిందే.


More Bhakti News