శక్తిమంతమైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు

మానసికపరమైన ... శారీరకపరమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు నరసింహస్వామి క్షేత్రాలనుగానీ, హనుమంతుడి క్షేత్రాలనుగాని దర్శిస్తుంటారు. అలాగే గ్రహసంబంధమైన దోషాలబారిన పడినవాళ్లు ... దుష్టప్రయోగాల కారణంగా బాధలుపడుతున్నవాళ్లు కూడా నరసింహస్వామి క్షేత్రాలకుగానీ, హనుమంతుడి క్షేత్రాలకుగాని వెళుతుంటారు.

నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన కొన్ని క్షేత్రాలకు హనుమంతుడు క్షేత్రపాలకుడిగా కనిపిస్తుంటాడు. ఇక నరసింహస్వామితో కలిసి మరికొన్ని క్షేత్రాల్లో దర్శనమిస్తుంటాడు. నరసింహస్వామి ... హనుమంతుడు కొలువుదీరిన క్షేత్రాలు మరింత శక్తిమంతమైన క్షేత్రాలుగా ... మహిమాన్వితమైన క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.

అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'చోళంగిపురం' కనిపిస్తుంది. తమిళనాడు ప్రాతంలోని ఈ క్షేత్రంలో యోగనరసింహుడు అమృతవల్లి తాయారుతో కలిసి భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడి స్వామి హనుమంతుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చాడని స్థలపురాణం చెబుతోంది. హనుమంతుడు ఈ క్షేత్రంలో చతుర్భుజాలతో కొలువై వుండటం విశేషం.

సతమతం చేస్తోన్న దీర్ఘకాలిక వ్యాధులు ... దుష్టశక్తుల వలన కలుగుతోన్న బాధలు ... గ్రహసంబంధమైన దోషాలు ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే దూరమవుతాయని చెబుతారు. ఈ కారణంగానే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. యోగనరసింహస్వామినీ ... చతుర్భుజ హనుమను దర్శించుకుని ... పూజించుకుని బాధల నుంచి విముక్తిని పొందుతుంటారు.


More Bhakti News