శనిదోష ప్రభావం ఇలా తగ్గుతుందట !

శనిదోష ప్రభావం అనేక ఇక్కట్లకు ... ఇబ్బందులకు గురిచేస్తూ వుంటుంది. శనిదేవుడు ఇచ్చే ప్రతికూల ఫలితాలు నానాబాధలు పెడుతుంటాయి. శనిదోష ప్రభావం మానసికంగా శారీరకంగా కుంగదీస్తుంది ... సమస్యల సుడిగుండంలో పడదోస్తుంది. అందువల్లనే శనిదేవుడిని శాంతింపజేయడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.

ముఖ్యంగా పుష్యమాసంలో ఆయనని పూజించేవారి సంఖ్య ఎక్కువగా వుంటుంది. పుష్యమీ నక్షత్రానికి దేవతగా 'శనీశ్వరుడు' చెప్పబడుతున్నాడు. పుష్యమాసం ఆయనకి ప్రీతికరమైనదిగా స్పష్టం చేయబడుతోంది. అందువలన ఈ మాసంలో జరిపే పూజాభిషేకాల వలన ... స్తోత్రపఠనాల వలన ఆశించిన ఫలితం లభిస్తుంది.

సాధారణంగా శనిదోష నివారణకి సంబంధించిన ప్రయత్నాలలో భాగంగా, జపము ... దానము ... రత్నధారణ కనిపిస్తుంటాయి. కొన్ని జపాలు ... దానాలు శనిదేవుడిని ప్రసన్నుడిని చేస్తుంటాయి. అలాగే రత్నధారణ కూడా ఆయన అనుగ్రహం అందేలా చేస్తుంది. ఒక్కో గ్రహ సంబంధమైన దోషం నుంచి బయటపడటానికి ఒక్కో రత్నాన్ని ధరించవలసి ఉంటుంది.

ఈ నేపథ్యంలో శనిదోష ప్రభావం నుంచి బయటపడాలనుకునేవాళ్లు 'నీలమణి' ధరించడం మంచిదని చెప్పబడుతోంది. ఇది శనిదేవుడికి ప్రీతికరమైన రత్నంగా చెబుతారు. శనిదోష ప్రభావం వలన ఇబ్బందులు పడుతోన్నవాళ్లు 'నీలమణి' ధరించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుందనీ, ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గిపోతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News