పిలిస్తేనే దేవుడు పలుకుతాడా ?

భగవంతుడిపట్ల అసమానమైన భక్తిశ్రద్ధలుంటే ఆ స్వామి పిలిస్తే పలుకుతాడనీ, అడిగినవెంటనే వరాలజల్లు కురిపిస్తాడని అంటారు. అయితే పిలవకపోయినా ఆ స్వామి పరిగెత్తుకువచ్చి తన భక్తులకు సాయపడిన సందర్భాలు, వాళ్లు అడగకపోయినా అర్థంచేసుకుని వరాలను ప్రసాదించిన సంఘటనలు అనేకం కనిపిస్తుంటాయి.

సక్కుబాయి పాండురంగస్వామిని ఎంతగానో ఆరాధిస్తూ వుండేది. అత్తగారివలన ఆమె పడుతోన్న కష్టాలకు తల్లడిల్లిపోయిన స్వామి, ఆమెకి తెలియకుండానే సాయపడుతూ వస్తాడు. తన దర్శనం చేసుకోవాలనే ఆమె కోరిక నెరవేర్చడమే కాకుండా, ఆమెను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. ఇదే విధంగా ఆయన పురందరదాసు కూతురైన రుక్మీబాయికి కూడా సాయపడతాడు.

పురందరదాసు పాండురంగడికి మహాభక్తుడు. ఆయన కూతురు అత్తవారింట అష్టకష్టాలు పడుతుంటుంది. ఒకసారి రుక్మీబాయిని ఉద్దేశపూర్వకంగా కష్టపెట్టడం కోసం పెద్దమొత్తంలో గోధుమలు విసరమని అత్తగారు ఆదేశిస్తుంది. సున్నిత మనస్కురాలైన రుక్మీబాయి అత్తగారిని ఎదిరించలేక ఆ పనిని ఆరంభిస్తుంది. చేతులకు బొబ్బలు రావడంతో సొమ్మసిల్లి పడిపోతుంది.

ఆమె ఆ పని చేయలేకపోతే అత్తగారివలన మరిన్ని బాధలు పడుతుందని భావించిన పాండురంగడు, ఆమె స్పృహలోకి వచ్చేసరికి ఆ పనిని పూర్తిచేస్తాడు. ఆ తరువాత ఆమె అత్తగారి స్వభావంలో మార్పు తీసుకువస్తాడు. ఇలా ఎంతోమంది భక్తులు కష్టాలలో పిలవకపోయినా స్వామి పరిగెత్తుకు వచ్చాడు. అడగపోయినా సాయపడి వాళ్లకి సుఖశాంతులతో కూడిన జీవితాన్ని ప్రసాదించాడు.


More Bhakti News