కుజ దోషం

''ఇంత వయసు వచ్చినా ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా'' ? అనే ప్రశ్న వినిపించిన వెంటనే, ''ఆ అమ్మాయికి కుజ దోషం ఉందట''! అనే సమాధానం వినిపిస్తూ వుంటుంది. ఇక ఈ మాట విన్న వాళ్లంతా కుజదోషం అంత భయంకరమైనదా? అని అనుకోవడం సహజం. అయితే కుజదోషం గురించి అంతగా భయపడవలసిన పనిలేదు. అది పరిహారం లేనంత పెద్ద సమస్యకూడా కాదు. జాతకాలు చూసే వాళ్లలో కొందరు ఈ విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ రావడంవల్ల, కుజుడు అంటేనే కంగారు పడిపోయేంత పరిస్థితికి చేరుకోవడం జరిగింది. కొన్ని గ్రహాలతో కలిసి వున్నప్పుడు కుజుడు కూడా మేలు చేస్తాడనే విషయం చాలా మందికి తెలియదు.

భరద్వాజ మహర్షి ఓ సౌందర్యవతిని చూడటం వలన ఆయన మనసు అదుపు తప్పి 'రేతస్సు' భూమిపై పడింది. 'మంగళుడు'అనే పేరుతో ఆ శిశువు భూదేవి ఆలనా పాలనలో పెరిగాడు. అగ్నికి సమానమైన తేజస్సు కలిగినవాడు కాబట్టి అంగారకుడిగా ప్రసిద్ధి చెందాడు. విపరీతమైన కోపం ... అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోని పట్టుదల కుజుడి లక్షణాలుగా చెప్పబడ్డాయి. ఈ కోపం వలన తాత్కాలికమైన నష్టం జరిగినా ... పట్టుదల కారణంగా విజయాలు అందుకున్న వారి సంఖ్య ఎక్కువని చరిత్ర చెబుతోంది.

ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో వున్నాడా? లేక దోషస్థానంలో ఉన్నాడా ? అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం వుంటే అది ఏ స్థాయిలో ఉందో ... అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా అడిగితెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం వుందని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి వుంటుంది.

ఇక కుజ దోషం వుందని చెప్పినా విచారంలో మునిగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా వుండదు. అది వున్న స్థానాన్ని బట్టి తీవ్రత ... ఫలితం మారుతూ వుంటుంది. ఇక మేషం - వృశ్చిక రాశులలో పుట్టినవారికి కుజదోషం వర్తించదని 'జ్యోతిష్ గ్రంధ్'అనే ప్రాచీన కాలంనాటి గ్రంధం చెబుతోంది.

కుజ దోషం వున్నవారు భూమాతను ... సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వలన, అంగారకుడి అనుగ్రహం లభిస్తుందని తెలుస్తోంది. అలాగే మంగళ వారాల్లో దేవాలయాల్లో దీపారాధన చేయడం ... పగడాన్ని ధరించడం పరిష్కార మార్గాలుగా చెప్పబడుతున్నాయి. ఇక దోషం ఎంత బలంగా ఉన్నా డీలాపడి పోవలసిన పనిలేదు. ఎందుకంటే అన్ని దోషాలకు విరుగుడు ఆ సర్వేశ్వరుడి అనుగ్రహమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News