రంభా వ్రతం

'రంభా వ్రతం' అనగానే ఇదేదో దేవలోకంలో అప్సరస అయిన రంభకి సంబంధించిన వ్రతమని అనుకుంటే పొరబాటే. రంభా వ్రతమనగా అరటి చెట్టును పూజించడం. అరటి చెట్టును రంభా వృక్షమని అంటారు ... అలాంటి అరటిచెట్టును సాక్షాత్తు పార్వతీదేవి పూజించిందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పూర్వం శివుడిని పెళ్లాడటానికి పార్వతి చేసిన ప్రయత్నాలు విఫలం అవుతూ ఉండటంతో, ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. ఏంచేయాలో తోచని పరిస్థితుల్లో, రంభా వ్రతాన్ని ఆచరించమని భ్రుగు మహర్షి ఆమెకి సూచించాడు. ఆ వ్రత మహాత్మ్యాన్ని గురించి ఆమెకి వివరించాడు. సావిత్రి ... గాయత్రిలలో బ్రహ్మపట్ల సావిత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించేదట. దాంతో బీజంలేని వృక్షంగా భూలోకాన పడిఉండమని ఆమెను బ్రహ్మ శపించాడు.

దాంతో సావిత్రి అరటిచెట్టు రూపంలో వుంటూనే బ్రహ్మ గురించి తప్పస్సు చేసి ఆయన మనసు గెలుచుకుంది. బ్రహ్మ సంతృప్తి చెంది ఆమెను సత్యలోకానికి తీసుకువెళుతూ, ఆమె అంశాన్ని మాత్రం అరటిచెట్టులోనే వుంచేశాడు. ఈ కారణంగానే అరటి చెట్టుకు కోరిన వరాలనిచ్చే శక్తి లభించిందనీ, 'లోపాముద్ర' కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే అగస్త్యుని భర్తగా పొందిందని పార్వతీ దేవితో చెప్పాడు భ్రుగుమహర్షి.

దాంతో ఈ వ్రతాన్ని ఆచరించడానికి పార్వతీదేవి సిద్ధపడింది. భ్రుగు మహర్షి చెప్పినట్టుగానే ... జ్యేష్ట శుద్ధ తదియ రోజున తెల్లవారు జామున తలస్నానం చేసి, అరటిచెట్టున్న ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టింది. చెట్టుకింద మంటపాన్ని ఏర్పాటుచేసుకుని దానిలో పాయసం ... భక్ష్యాలను నైవేద్యంగా సమర్పించింది.

ఏ రోజు నైవేద్యాలను ఆ రోజు సాయంత్రం దీపం పెట్టే సమయంలో దంపతులకు దానం ఇచ్చింది. ప్రతి రోజు సాయంత్రం వరకూ అక్కడే సావిత్రి స్తోత్రాలు చదువుతూ గడిపింది. మొదటి రోజున మాత్రమే జాగరణ చేసి ... నెలరోజుల పాటు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది. ఫలితంగా పార్వతీదేవి ... పరమశివుడుని భర్తగా పొందగలిగింది.


More Bhakti News