స్వామివారి పాదాలను తాకే సూర్యకిరణాలు

పుణ్యక్షేత్రాల్లో అడుగుపెట్టడమే అదృష్టంగా భావిస్తుంటారు ... అక్కడి విశేషాలు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. దృశ్యరూపంగా దర్శనమిచ్చే కొన్ని విశేషాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆయా క్షేత్రాల్లోని మూలమూర్తులపై సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉండటం కూడా అలాంటి విశేషాల్లో ఒకటిగా చెప్పబడుతోంది.

కొన్ని పుణ్యక్షేత్రాలలో విశేషమైనటువంటి రోజుల్లో గర్భాలయంలోని స్వామివారిపై సూర్యకిరణాలు పడుతుండటం జరుగుతూ ఉంటుంది. అలా సూర్యభగవానుడిచే వెలుగు హారతులు అందుకునే క్షేత్రంగా 'వనిపాకల' దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రాచీనతకు అద్దంపడుతూ ఉంటుంది.

గర్భాలయంలో లక్ష్మీనారాయణులు నుంచున్న మూర్తులుగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం ఎంతో వైభవంగా వెలుగొందినట్టుగా చెబుతారు. ఆశ్వయుజ మాసంలో మూడురోజుల పాటు ... ఫాల్గుణ మాసంలో మూడురోజుల పాటు ఇక్కడి స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి.

ఈ విశేషాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. సూర్యభగవానుడిచే స్వామివారు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటూ ఉండటం చూసి తరించిపోతారు.ఇక్కడి స్వామివారి మహిమలు అనుభవంలోకి వచ్చినందువలన ... ప్రత్యక్ష నారాయణుడుగా చెప్పబడుతోన్న సూర్యభగవానుడు, ఇక్కడి లక్ష్మీనారాయణుడిని సేవిస్తోన్న కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా విశ్వసిస్తుంటారు ... ఈ క్షేత్ర దర్శనం సకల శుభాలను ప్రసాదిస్తుందని చెబుతుంటారు.


More Bhakti News