అర్థాంగి సహకారం కావలసిందే !

మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే వాళ్లు దైవానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడం వెనుక ఆ ఇంటి ఇల్లాలు ఉందనే విషయం స్పష్టమవుతూ ఉంటుంది. భర్త నిరంతరం దైవనామస్మరణ చేస్తూ ... ధ్యానం చేస్తూ ఉంటే, భార్యగా మనసు తెలుసుకుని మసలుకుంటూ తగిన సేవలను అందించారు.

పరమాత్ముడి పాదపద్మాలను భర్త ఆశ్రయించి ఆ స్వామి సేవకి ఆయన అంకితమయ్యేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించారు. తులసీదాసు భార్య రత్నావళి .. తనపట్ల వ్యామోహంతో ఉన్న భర్త దృష్టిని భగవంతుడి వైపుకి మళ్లిస్తుంది. ఫలితంగా మహా భక్తుడిగా తులసీదాసు కీర్తి ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.

అలాగే ఆదిలో తుకారామ్ భక్తిశ్రద్ధలు చీకాకు కలిగించినా, ఆ తరువాత అర్థంచేసుకుని, ఆయన జపతపాలకు జిజియా ఎంతగానో సహకరిస్తుంది. ఆయన ఆరాధనకు అడ్డుపడకుండా కుటుంబ బాధ్యతను తాను మోస్తుంది. ఇక గోపన్న (రామదాసు) భార్య కమల కూడా భర్త మనసును అర్థంచేసుకుని నడచుకుంటుంది. భద్రాచలంలో రామాలయం నిర్మించాలనే ఆయన సంకల్పం నెరవేరడానికిగాను తనవంతు కృషిచేస్తుంది.

పురందరదాసు భార్య సరస్వతీబాయి కూడా ఆ పాండురంగస్వామి భక్తురాలే. తన భర్త ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ముందే ఆమె ఆ స్వామిని ఆరాధిస్తూ ఉండేది. ఆ పాండురంగస్వామి సేవ కోసం పురందరదాసు ఆస్తిపాస్తులను వదులుకుంటున్నా ఆమె ఆనందిస్తుందే తప్ప అడ్డుచెప్పదు. ఆ తరువాత భర్తతో కలిసి ఊరూరా తిరగవలసి వచ్చినా బాధపడదు.

పతిని సేవించడం ... పాండురంగస్వామిని పూజించడం మినహా సరస్వతీబాయికి మరోధ్యాస ఉండేది కాదు. ఆ పుణ్యఫల విశేషం కారణంగానే, భర్తకు పాదసేవ చేస్తూనే ఆమె తన ప్రాణాలను వదిలేస్తుంది. ఇలా వాళ్లు భగవంతుడి సేవలో లీనమైన భర్తకు సేవలు చేస్తూ వచ్చారు ... భర్త అనురాగానికీ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులై తరించారు.


More Bhakti News