విరూపాక్ష విచిత్రం

నమ్మలేని సంఘటనలు కళ్లముందు జరుగుతుంటే సహజంగానే ఆశ్చర్యపోతుంటాం. ఏదో మహిమ కారణంగానే అది అలా జరిగి ఉంటుందని భావిస్తుంటాం. హంపీలోని విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించినప్పుడు కూడా ఇలాంటి భావనే కలుగుతుంది. ఇక్కడి ఆలయంలోని మంటపంలో 12 స్తంభాలు ... 12 రాశులకు సంబంధించినవిగా వుంటాయి. ప్రతి స్థంభంపై ఆయా రాశులకు చెందిన అధిపతుల చిత్రాలు చెక్కబడి వుంటాయి.

ఈ మంటపం పైభాగంలో తూర్పు ... పడమర ... ఉత్తర ... దక్షిణ దిక్కులలో చిన్న చిన్న రంధ్రాలు చేయబడి వున్నాయి. సూర్య కిరణాలు ఆ రంధ్రాల గుండా ఆ స్తంభాలపై నేరుగా పడుతుంటాయి. అయితే విశేషమేమిటంటే ... సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో, ఆ రాశికి చెందిన స్తంభం పై మాత్రమే సూర్య కిరణాలు పడుతూ వుంటాయి.

ఇక ఆలయం వెలుపలనున్న గోడలపై ఒక వైపు సూర్యు బింబం ... మరొక వైపు చంద్ర బింబం చెక్కబడి వున్నాయి. సూర్య కిరణాలు చంద్రబింబం ముద్రపై గానీ, చంద్ర కిరణాలు సూర్య బింబం ముద్రపై గానీ పడక పోవడం విస్మయులను చేస్తుంది. ఈనాటికీ అందని ఆనాటి సాంకేతిక పరిజ్ఞానానికి ఇదొక ఉదాహరణ అని కొందరు అంటుంటారు. మరికొందరేమో మహిమాన్వితమైన దైవ లీలగా దీనిని భావిస్తుంటారు.

ఏదేవైనా వాస్తు ... జ్యోతిష ... గణిత శాస్త్రాలపై ఆనాటి వారికిగల ప్రతిభాపాటవాలకు మచ్చుతునకగా కనిపించే ఈ దేవాలయాన్ని దర్శించడం ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది ... ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పక తప్పదు.


More Bhakti News