సకల శుభకరం సాలగ్రామ శివలింగ దర్శనం

మహర్షులు తమ తపస్సుకి అనుకూలమైన ప్రదేశాలను ఎంచుకుని అక్కడ తపస్సును కొనసాగించేవాళ్లు. మహర్షుల తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన పరమశివుడు వాళ్ల అభ్యర్థన మేరకు ఆవిర్భవించిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి.

ఇక తాము అనునిత్యం పూజాభిషేకాలు నిర్వహించడం కోసం మహర్షులు ప్రతిష్ఠించినవిగా చెప్పబడుతోన్న శివలింగాలు కూడా ఆ తరువాత కాలంలో ఆలయాల నిర్మాణం జరుపుకుని విశిష్టమైన విశ్వేశ్వర క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి శైవ క్షేత్రాలలో ఒకటిగా 'మల్లన్న పాలెం' దర్శనమిస్తుంది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి గుట్టపై శివుడు 'మల్లన్న' పేరుతో కొలువుదీరి భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు. స్వామివారి ఆవిర్భావం తరువాతనే ఊరు ఏర్పడి ఉంటుందనీ, అందువలన ఈ ఊరికి మల్లన్నపాలెం అనే పేరు వచ్చిందని అంటారు. గుట్టపై గల ఈ శివాలయం ప్రాచీనకాలం నాటిదనీ ... మహర్షులు పూజించిన ఆనవాళ్లు ఉన్నాయని చెబుతుంటారు.

కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిన ఇక్కడి శివుడికి ఆనాటి నుంచి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి శివలింగం పూర్తి సాలగ్రామ శిల కావడం విశేషం. గుట్టపైన సహజసిద్ధంగా ఏర్పడిన 'కోనేరు' కనిపిస్తుంది. ఈ గుట్టపైకి చేరుకోవడానికి మెట్లులేవు. కాస్త కష్టమే అయినా భక్తులు ఓపిక చేసుకుని గుట్టపైకి చేరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మెట్ల నిర్మాణం జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతి సోమవారం రోజున ... కార్తీక మాసంలోను ... శివరాత్రి పర్వదినంలోను భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు. మహర్షులు తిరుగాడిన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే అదృష్టమనీ, వాళ్లు పూజించిన మల్లన్న స్వామిని దర్శించడమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఇక్కడి శివయ్యను పూజించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి సకలశుభాలు కలుగుతాయనే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News