ఇక్కడి రంగనాయకస్వామిని దర్శిస్తే చాలు

వైష్ణవ సంబంధమైన ఆలయాలలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇక గోదాదేవి సమేత రంగనాయకస్వామి కొలువుదీరిన క్షేత్రమైతే అక్కడ ధనుర్మాస ఉత్సవాలు మరింత వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'గణపవరం'. నల్గొండ జిల్లా కోదాడ మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించిన ఇక్కడి ఆలయం రంగనాయకస్వామి వైభవాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు శేష శయనుడిగా కొలువుదీరి ఉండగా ప్రత్యేక మందిరాల్లో గోదాదేవి - మహాలక్ష్మి దర్శనమిస్తుంటారు.ఇక గర్భాలయంలో స్వామివారితో పాటు వరవర మహాముని కూడా దర్శనమిస్తూ ఉండటం విశేషం. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని వరవర రంగనాయకస్వామి క్షేత్రంగా పిలుస్తుంటారు.

చాలాకాలం క్రిందట ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడికి అందిన స్వప్న సందేశం కారణంగానే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతుంటారు. ఆ భక్తుడికి వచ్చిన స్వప్నం ప్రకారం వరవర మహాముని విగ్రహం ఒక నిర్జన ప్రదేశంలో గల పుట్టలో లభించిందని అంటారు. ప్రశాంతమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఆధ్యాత్మిక పరమైన ఆహ్లాదాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు ... సేవలు జరుపుతుంటారు. తిరు నక్షత్రోత్సవాలు కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఈ ప్రాంగణంలో లక్ష్మీనారాయణులు ... రామానుజులు ... ఆళ్వారులు ప్రత్యేక మందిరాల్లో కొలువై పూజలు అందుకుంటూ ఉంటారు. ఇక్కడి స్వామివారిని దర్శిస్తేచాలు సకలశుభాలు చేకూరతాయని భక్తులు చెబుతుంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని జరుపుతుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News