ఆసక్తికర విశేషాలను ఆవిష్కరించే గుట్ట !

పాండవుల పేరు వినిపించని ప్రాచీన క్షేత్రాలు తక్కువేనని చెప్పాలి. ఏదో ఒక విధంగా ఆయా క్షేత్రాలతో వాళ్లకి అనుబంధం ఉందని చెప్పే సంఘటనలు స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటాయి. పాండవులు అరణ్యవాస కాలంలో అనేక ప్రాంతాలమీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించడమే ఇందుకు కారణం.

అరణ్యవాస కాలంలో పాండవులు ఎన్నో క్షేత్రాలను దర్శించారు ... మరెన్నో ప్రదేశాల్లో బస చేశారు. అందువల్లనే ఆయా ప్రాంతాలలో గల కొన్ని మందిరాలను పాండవుల గుళ్లనీ ... వాళ్లు నివసించిన గుట్టలను పాండవుల గుట్టలని పిలుస్తుంటారు. అలా పాండవులలో ఒకడైన భీముడు ... ఆయనపై మనసు పారేసుకున్న 'హిడింబి' అనే రాక్షస కన్య గురించి ఒకానొక క్షేత్రంలో వినిపిస్తుంది.

'మెట్టుగుట్ట' గా పిలవబడుతోన్న ఆ క్షేత్రం వరంగల్ జిల్లా మడికొండలో కనిపిస్తుంది. శివకేశవులు కొలువైన ఈ క్షేత్రంలో, స్థూపం ఆకారంలో రెండు శిలారూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకదానిపై ఒకటిగా పెద్ద పెద్ద బండరాళ్లు పేర్చినట్టుగా ఈ శిలారూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. భీముడిపై మనసుపడి అతని వలన 'ఘటోత్కచుడు'కి జన్మనిచ్చిన హిడింబి, ఆటలో భాగంగా ఈ రాళ్లను ఇలా పేర్చిందనే కథనం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.

ఈ విషయంలో సందేహపడేవారికి సమాధానం అన్నట్టుగా ఆ పక్కనే భీముడివిగా చెప్పబడుతోన్న పాదముద్రలు కనిపిస్తుంటాయి. సహజసిద్ధంగా కనిపించే ఈ పాదముద్రలు చూస్తే, హిడింబితో భీముడు ఈ ప్రదేశానికి వచ్చాడనే విశ్వాసం కలుగుతుంటుంది. శివకేశవులు ఆవిర్భవించిన తీరు ... ఆయా భక్తులను వాళ్లు అనుగ్రహించిన వైనం ... వ్యాధులను నివారించే ఇక్కడి గుండాలలోని తీర్థం ... ఈ క్షేత్ర విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అనేక విశేషాలకు ... మహిమలకు ఈ క్షేత్రం నిలయమని చాటుతుంటాయి.


More Bhakti News