ఆ అమ్మవారంటే అందరికీ ప్రాణమే

వివిధ గ్రామాలను పరిశీలించినప్పుడు ఆదిపరాశక్తియైన అమ్మవారు అక్కడ వివిధ నామాలతో ... రూపాలతో గ్రామదేవతగా పూజలు అందుకుంటూ దర్శనమిస్తుంది. ముత్యాలమ్మ .. పోచమ్మ ... మంచాలమ్మ ... మైసమ్మ మొదలైన పేర్లతో అక్కడి గ్రామస్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది.

రాఘవేంద్రస్వామి మంచాల గ్రామంలో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అక్కడి గ్రామదేవతయైన మంచాలమ్మను ప్రసన్నం చేసుకుని ఆ తల్లి అనుమతి తీసుకుంటాడు. గ్రామదేవతకు గల ప్రాధాన్యతకు ఈ సంఘటన నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక కొన్ని ప్రదేశాల్లో అమ్మవారి మహిమలను బట్టి ఆ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.

అలా పుణ్యక్షేత్రాన్ని తలపించే 'దండు మైసమ్మ' ఆలయం మనకి 'నెమ్మికల్' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలో ఈ ఆలయం అలరారుతోంది. సాధారణంగా గ్రామదేవతల ఆలయాల చెంత మంగళ - శుక్రవారాల్లోను, జాతర రోజుల్లోనూ భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. అందుకే ఇక్కడ పూజా సామాగ్రిని విక్రయించే దుకాణాలు .. ఆటబొమ్మల దుకాణాలు ... మిఠాయి దుకాణాలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి.

ఇక్కడి అమ్మవారు తమ ఇష్టదైవమనీ .. తమ ప్రాణమని భక్తులు ఆ తల్లిపట్ల గల ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తుంటారు. అమ్మవారిని దర్శించుకోవడం వలన అనేక రకాలైన సమస్యలు తొలగిపోతాయనీ, ఎలాంటి ఇబ్బందులులేని జీవితం లభిస్తుందని చెబుతుంటారు. సంపదలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు. అందువల్లనే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుని మొక్కుబడులు చెల్లించుకుని ఆశీస్సులు తీసుకుని వెళుతుంటారు.


More Bhakti News