లక్ష్మీ స్వరూపం

సాధారణంగా బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించడం చూస్తుంటాం. ఖరీదు పరంగా ... పవిత్రత పరంగా బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. బంగారం వాడుక మన ఆచార సంప్రదాయాల్లో ఒక భాగమైపోవడం కారణంగా కూడా దానికి ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. అలాంటి బంగారాన్ని ఇతరులకు ఇవ్వడానికి స్త్రీలు ఎంతగానో సందేహిస్తారు.

చాలా మంది స్త్రీలు బంగారం విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా ప్రవర్తిస్తుంటారు. అయితే శాస్త్రం కూడా అలా ఉండమనే చెబుతోంది. బంగారం లక్ష్మీ స్వరూపం కాబట్టి, అది చేతులు మారకుండా చూసుకోవడం పైనే సిరిసంపదలు ఆధారపడి ఉంటాయని చెబుతోంది. ముఖ్యంగా కన్నతల్లి కూడా అత్తారింటికి వెళుతోన్న తన కూతురికి బంగారపు లక్ష్మీ రూపును ఇవ్వడానికి ఆలోచించుకోవాలని అంటోంది. కేవలం యజ్ఞ యాగాదులు చేసినప్పుడు తప్ప, మరే సందర్భాల్లోనూ బంగారం దానం చేయడం మంచిదికాదని చెబుతోంది.

ఇక నేటి కాలంలో నగదును కూడా మహాలక్ష్మి గానే భావించడం జరుగుతోంది కాబట్టి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజున మాత్రం డబ్బు తమ చేతుల మీదుగా ఇతరులకి ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప వీరు ఆ రోజున డబ్బు బయటికి తీయరు. ఇక శుక్రవారం మాత్రమే కాకుండా మంగళవారం రోజున గానీ, అమావాస్య రోజునగాని డబ్బులు మరొకరికి ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీ దేవికి చంచల స్వభావం ఎక్కువ గనుక ఆమెను నిర్లక్ష్యం చేయకుండా సాధ్యమైనంత వరకూ స్థిరంగా ఉంచడానికే ప్రయత్నించాలని సూచిస్తోంది.


More Bhakti News