శత్రువును గుర్తించకపోవడమే పెద్ద ప్రమాదం

అజాతశత్రువుగా ఉండటం అంతతేలికైన విషయం కాదు. కొన్ని నిర్ణయాలు కొంతమందికి మంచిచేస్తే, వాటి వలన ఇతరులకు నష్టం కలిగి శత్రువులు పుట్టుకొస్తారు. ఇక కోరిన సాయం చేయకపోవడం వలన అప్పటివరకూ స్నేహితులుగా ఉన్నవాళ్లు శత్రువులుగా మారుతుంటారు.

ఇక ఎవరికీ ఎలాంటి హాని కలిగించకుండా జీవితంలో ఎదుగుతుండటం వలన కూడా అసూయతో శత్రువులు తయారవుతుంటారు. శత్రువు ఎవరో తెలిసినప్పుడు ... వాళ్లను దూరంగా ఉంచినప్పుడు కలిగే నష్టం తక్కువగానే ఉంటుంది. శత్రువని తెలియనప్పుడు ... ఆ శత్రువు మంచిముసుగులో మన పక్కనే ఉన్నప్పుడు కలిగే నష్టం పూడ్చుకోలేనిదిగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా మనకి శకుని ... దుర్యోధనులు కనిపిస్తుంటారు.

అభిమానధనుడైన దుర్యోధనుడికి ఒకానొక విషయంలో శకుని తండ్రి అయిన గాంధార రాజు ధోరణి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది. గాంధార రాజు తనకి తాత అయినా ... శకుని మేనమామే అయినా కనికరమనేది లేకుండా వాళ్లని దుర్యోధనుడు చెరసాలలో బంధిస్తాడు. అందరికీ కలిపి ఒక ముద్ద భోజనం మాత్రమే ఏర్పాటుచేస్తాడు. కౌరవులపై పగ తీర్చుకోవడానికి తమలో ఒకడు బతికితీరాలని భావించిన గాంధార రాజు, అందరినీ ఒప్పించి ఆ అన్నం ముద్ద శకునికి మాత్రమే దక్కేలా చేస్తాడు.

ఫలితంగా శకుని మాత్రమే ప్రాణాలతో ఉండగా అంతా మరణిస్తారు. అంతకాలం చెరసాలలో ఉన్న శకుని విషయంలో దుర్యోధనుడికి సానుభూతి కలిగి అతణ్ణి చేరదీస్తాడు. ఇక ఆ క్షణం నుంచి పాండవుల విషయంలో దుర్యోధనుడికి అన్నీ తప్పుడు సలహాలనిస్తూ ... తప్పుడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు. పాండవుల పతనంపై దృష్టి పెట్టిన దుర్యోధనుడు, శకుని మాయ మాటలను .. మంత్రాంగాన్ని గ్రహించలేకపోతాడు. దాంతో శకుని పథకానికి తిరుగులేకుండాపోతుంది. పాండవుల చేతిలో కౌరవులంతా ప్రాణాలు పోగొట్టుకునేలా చేసి ఆయన తన ప్రతీకారం తీర్చుకుంటాడు ... తండ్రికిచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు.


More Bhakti News