ఆకలిని దూరం చేసే అపూర్వమైన వరం !

జూదం ఆడకూడదనే విషయం ధర్మరాజుకి తెలుసు ... అయితే జూదానికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు తిరస్కరించకూడదనే నియమం ఆయనకి ఉంది. అందువలన కౌరవులు జూదానికి ఆహ్వానం పంపినప్పుడు కాదనలేకపోతాడు. శకుని మాయా పాచికల కారణంగా పాండవులు జూదంలో ఓడిపోతారు. పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ... ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి అంగీకరించి బయలుదేరుతారు.

పాండవులు ఎంతటి పరాక్రమవంతులో అంతటి సుగుణ సంపన్నులనే విషయం ప్రజలందరికీ తెలుసు. దాంతో చాలామంది ప్రజలు పాండవులను అనుసరిస్తూ అడవులకు వెళతారు. వద్దని ధర్మరాజు ఎంతగా వారించినా వాళ్లు వినిపించుకోరు. పాండవులు లేని రాజ్యంలో తాము ఉండలేమని చెబుతూ, వాళ్లతో పాటు కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతూంటారు.

ఈ ప్రయాణంలో ఆకలితో తాము పడుతోన్న బాధను గురించి ధర్మరాజు పెద్దగా పట్టించుకోడు. కానీ అభిమానంతో తమని అనుసరిస్తూ వస్తోన్న ప్రజలు ఆకలికి తట్టుకోలేకపోతుండటం ఆయనకి ఎంతో బాధ కలిగిస్తుంది. దట్టమైన అరణ్య ప్రాంతంలో అంతమంది ఆకలిని ఎలా తీర్చాలో ఆయనకి అర్థంకాలేదు. ఈ విషయాన్ని గురించి ఆయన మహర్షుల చెంత ఆవేదన వ్యక్తం చేయగా, సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అందించే సూర్యుడిని ప్రార్ధించమని సూచిస్తారు.

దాంతో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సూర్యభగవానుడిని ప్రార్ధిస్తాడు. ప్రత్యక్షమైన సూర్యభగవానుడు, ధర్మరాజుకి 'అక్షయపాత్ర'ను ప్రసాదిస్తాడు. కోరిన ఆహార పదార్థాలను ఆ పాత్ర ప్రసాదిస్తుందనీ, ఎంతమంది ఆకలినైనా తీరుస్తుందని చెబుతాడు. ఆకలితీర్చే అపూర్వమైన వరాన్ని పొందిన ధర్మరాజు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.

అక్షయపాత్రను సంతోషంగా తీసుకువచ్చి ద్రౌపతికి అందజేస్తాడు .. దాని ద్వారా ఆమె అందరి ఆకలి తీరుస్తుంది. తమ పట్ల ప్రేమానురాగాలతో వెంట వచ్చిన వారి ఆకలిని తీర్చే మార్గం లభించడంతో ధర్మరాజుకి మనసు కుదుటపడుతుంది. సమస్త భోగాలకు దూరమై అడవుల్లో కష్టాలు పడుతున్నందుకు కాకుండా, తమ ఆకలిని గురించి బాధపడుతూ దానిని తీర్చే మార్గాన్ని అన్వేషించిన ధర్మరాజు పట్ల ప్రజలకి గల ప్రేమానురాగాలు మరింత ఎక్కువవుతాయి.


More Bhakti News