దర్శన వేళలు

సాధారణంగా దైవ దర్శనానికి చాలామంది ఉదయం వేళనే ఎంచుకుంటారు. ఉదయాన్నే స్నానంచేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి దైవదర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భావిస్తుంటారు. మరి కొందరు సాయంకాలమైతే ఎలాంటి హడావిడి లేకుండా కాస్త తీరుబడిగా దైవదర్శనం చేసుకోవచ్చని అనుకుంటారు. ఇక మిగతావారు వీలునుబట్టి దగ్గరలోని ఆలయాలకి వెళుతూ వుంటారు.

ఈ నేపథ్యంలో విష్ణాలయం ... శివాలయం ఒకేచోట ఉన్నట్టయితే పనిలో పనిగా ఒకదాని తరువాత ఒకటిగా దర్శనాలు చేసుకుంటారు. 'ప్రభువు కరుణ లేనిది జగతినేమి వున్నది' అన్నట్టు ఆయన అనుగ్రహం అందరిపై ఉన్నప్పటికీ, వారిని దర్శించే వేళలు మాత్రం వేరుగానే వున్నాయనే విషయాన్ని గమనించాలి. శ్రీ మహావిష్ణువును ఉదయం వేళలో ... సదాశివుడిని సాయంకాలంలో దర్శించుకోమని శాస్త్రం చెబుతోంది.

శ్రీమన్నారాయణుడు స్థితి కారకుడు కాబట్టి, నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే కష్టనష్టాలను గురించి ఆయనకే చెప్పుకోవాలి. మన మొరని ఆయన ఆలకించాలంటే ఉదయం వేళ కాస్త తీరిగ్గా ఉన్నప్పుడే, ఆయనను దర్శించుకుని మన గోడును వినిపించాలి. ఇక శంకరుడు లయకారకుడు కాబట్టి, రోజు పూర్తి అవుతున్న సమయంలో ఆయనను దర్శించుకోవాలి. ఆపద సమయాల్లో చిక్కున్నప్పుడు ... ప్రాణహాని కలిగినప్పుడు శంకరుడి అనుగ్రహం తప్పనిసరిగా అవసరమవుతుంది. శివకేశవుల దర్శన వేళల్లో శాస్త్రం విధించిన ఈ నియమాలను పాటించడం వలన తగిన పుణ్య ఫలాలను పొందవచ్చు.


More Bhakti News