నర్మదానదీ పుష్కరాలు

పరమశివుడి శూలాగ్రం నుంచి ఉద్భవించినదిగా చెప్పబడుతోన్న నర్మదా నది ఎంతో పవిత్రమైనది ... మరెంతో పుణ్య ప్రదమైనది. గంగానది భూలోకానికి రావడానికి ఎలాంటి ఆసక్తికరమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయో, నర్మదా నది భూలోకానికి రావడం వెనుక కూడా అలాంటి బలమైన కారణాలే ఉన్నట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

పూర్వం 'పురూరవ చక్రవర్తి' పాపాలు హరించుకుపోవడానికి ... పితృ దేవతలకు మోక్షం కలగజేయడానికి శివుడి గురించి కఠోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు, నర్మదా నదిని భూలోకానికి పంపించడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆమె ఉధృతిని తట్టుకునే శక్తిమంతులెవరో చెప్పమని అడిగాడు. అందుకు వింధ్య పర్వత కుమారుడైన 'అమర కంఠుడు'తగినవాడని భావించిన పురూరవుడు అతణ్ణి ఒప్పించాడు.

దాంతో శివుడి ఆదేశం మేరకు నర్మద దివి నుంచి భువికి దూకింది. ఈ కారణంగానే అమరకంఠ పర్వత ప్రాంతంలో నర్మదా దేవి ఆలయం కనిపిస్తుంది. దేవలోకంలో ప్రవహించింది కాబట్టి, నర్మదా నది నీరు ఎంతో రుచిగా వుంటుంది. ఈ కారణంగానే దీనిని 'సురస'అని పిలుస్తూ వుంటారు. ఇక దక్షిణ భారతదేశాన ప్రవహిస్తుంది కాబట్టి దీనిని 'దక్షిణ గంగ'గా ... మహా వేగంతో పరుగులు తీస్తుంది కాబట్టి 'మహతి'గా ప్రస్తావిస్తుంటారు.

ఇంకా ఈ నదికి 'మందాకిని' ... 'యమున' ... 'అమృత' ... 'విమల'అనే పేర్లు కూడా వున్నాయి. గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో ఈ నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోవడమే కాకుండా, 'అశ్వమేథ యాగం' చేసినంత పుణ్యఫలం లభిస్తుందని అంటారు. మధ్యప్రదేశ్ లోని అమర్ కంఠక్ పర్వతాల్లో పుట్టిన ఈ నది, మహారాష్ట్ర ... గుజరాత్ ... రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది.


More Bhakti News