ఇక్కడి అటుకులతో ధనధాన్యాల వృద్ధి !

దైవ సంబంధమైన కొన్ని వస్తువులను ధనాన్ని జాగ్రత్త చేసే చోట ... ధాన్యాన్ని నిల్వచేసే చోట ఉంచడం జరుగుతుంటుంది. ఈ విధంగా చేయడం వలన ధనధాన్యాలకు ఎలాంటి లోటు రాదనీ ... అవి వృద్ధిచెందుతూ ఉంటాయని విశ్వసిస్తుంటారు.

అయితే ఒక ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే 'అటుకులు' కూడా భక్తులు ధనధాన్యాలు జాగ్రత్తచేసే ప్రదేశంలో ఉంచుతుంటారు. అలా ఉంచడం వలన ధనధాన్యాల కొరత ఏర్పడదని నమ్ముతుంటారు. అటుకుల విషయంలో వాళ్లకి అంతటి విశ్వాసం కలగడానికి కారణం, సుధాముడుపైనా ఆయన ప్రాణ స్నేహుతుడైన శ్రీకృష్ణుడిపైన వాళ్లకి గల భక్తి శ్రద్ధలే.

అటుకులను ప్రసాదంగా పంచుతోన్న ఆ ఆలయం సాక్షాత్తు సుధాముడిదే. గుజరాత్ - పోరుబందర్ లో గల ఈ ఆలయంలో సుధాముడి దంపతులతో పాటు కృష్ణుడు కూడా కొలువై కనిపిస్తాడు. సుధాముడు ... కృష్ణుడు బాల్య స్నేహితులు. ఇద్దరూ సాందీపుని గురుకులంలో విద్యను అభ్యసిస్తారు. వాళ్లిద్దరూ ఇక్కడే ఆటపాటలతో ఆనందంగా గడిపారని చెబుతారు.

గురుకులం నుంచి బయటికి వచ్చిన తరువాత సుదాముడు కృష్ణుడిని కలుసుకోలేకపోతాడు. భార్యాబిడ్డలను పోషించడానికే ఆయన సతమతమైపోతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో తన పేదరికాన్ని కృష్ణుడికి చెప్పుకోవడానికి బయలుదేరుతూ, ఆయనకి ఇష్టమైన అటుకులు తీసుకుని వెళతాడు సుధాముడు. వాటిని ఇష్టంగా ఆరగించిన కృష్ణుడు ఆయన అడగకపోయినా అపారమైన సిరిసంపదలను ప్రసాదిస్తాడు.

సుధాముడిని కృష్ణుడు ఆదుకున్నతీరు నిజమైన స్నేహానికి నిర్వచనంలా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ఆలయ దర్శనం అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో నైవేద్యంగా సమర్పించిన అటుకులను ప్రసాదంగా ఇస్తారు. భక్తులు వాటిని తమ ఇంట్లో ధనధాన్యాలు గల ప్రదేశంలో ఉంచుతుంటారు. ఈ విధంగా చేయడం వలన తమ సంపదలు వృద్ధి చెందుతూ ఉంటాయనే ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News