అద్భుతమైన ఆ ఘట్టం ఇక్కడే జరిగిందట !

సాధారణంగా ప్రాచీనకాలం నాటి శివాలయాలను దర్శిస్తే, అక్కడి శివలింగాలను ప్రతిష్ఠించినవారి జాబితాలో రాముడు ... పరశురాముడు ... అగస్త్య మహర్షి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. రాముడు ... పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగాలు 'రామేశ్వరలింగం' పేరుతోను ... అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగాలు అగస్త్యేశ్వరలింగం పేరుతోను దర్శనమిస్తూ ఉంటాయి.

అందుకు భిన్నంగా విశ్వామిత్ర మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం ఒకానొక క్షేత్రంలో విరాజిల్లుతోంది. ఆ క్షేత్రమే 'సత్రశాల' ... ఇది గుంటూరు జిల్లా 'జెట్టిపాలెం'లో కనిపిస్తుంది. విశ్వామిత్రుడు ఈ ప్రదేశంలో 'సత్రయాగం' నిర్వహించడం వల్లనే ఈ క్షేత్రానికి 'సత్రశాల' అనే పేరు వచ్చిందని అంటారు. విశ్వామిత్రుడు ... దశరథ మహారాజును ఒప్పించి రామలక్ష్మణుల సహకారాన్ని తీసుకున్నది ఈ యాగం కోసమేనని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ వారి ప్రతిమలు దర్శనమిస్తూ ఉంటాయి.

ఇక్కడ కొలువైన పరమశివుడిని భక్తులు ప్రేమానురాగాలతో 'సంతాన మల్లయ్య' గా పిలుచుకుంటూ ఉంటారు. దేవతలు ... మహర్షుల అభ్యర్థన వలన అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించిన ఆదిదేవుడు, మానవాళికి శుభాలను చేకూరుస్తూ సంతోషాన్ని పొందుతుంటాడు. ఆయన కొలువైన ఒక్కో క్షేత్రంలో ఒక్కోవిధమైన మహిమలను ఆవిష్కరిస్తూ ఉంటాడు. స్వామి కొలువైన కొన్ని క్షేత్రాలు ఆయురారోగ్యాలను ... మరికొన్ని క్షేత్రాలు అష్టైశ్వర్యాలను అందిస్తూ ఉంటాయి.

ఇక 'సత్రశాల' విషయానికి వస్తే ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే కలిగే అనుభూతి ఆ విషయాన్ని స్పష్టం చేస్తుంటుంది. ఇక్కడి స్వామిని పూజించడం వలన 'సంతాన భాగ్యం' కలుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. ఈ కారణంగానే ఆయనని సంతాన మల్లయ్యగా చెప్పుకుంటూ ఉంటారు. సంతానలేమితో బాధపడుతోన్నవాళ్లు ఈ స్వామిని ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు ... ఆయన అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News