సుఖసంతోషాలనిచ్చే సుబ్రహ్మణ్యుడు

తారకాసురుడిని సంహరించడం కోసం జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి, లోక కల్యాణం కోసమే అనేక ప్రాంతాలలో ఆవిర్భవించాడు. ఆయన స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్నయితే, ఆ స్వామిని అనునిత్యం దర్శించుకోవడం కోసం భక్త బృందాలు నిర్మించుకున్నవిగా మరికొన్ని ఆలయాలు కనిపిస్తాయి.

సుబ్రహ్మణ్యస్వామి కొన్ని ఆలయాలలో సర్పరూపంలో దర్శనమిస్తుంటాడు. ఇక శక్తి ఆయుధాన్ని ధరించిన బ్రహ్మచారిగాను ... వల్లీ - దేవసేన సమేతుడిగాను భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా అమ్మవార్లతో స్వామి దర్శనమిచ్చే ఆలయాలలో ఒకటి 'శ్రీనివాసనగర్'లో కనిపిస్తుంది. ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో అలరారుతోంది.

తీర్చిదిద్దినట్టుగా ... కుదురుగా కనిపించే ఈ ఆలయంలో వల్లీ - దేవసేనలతో సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటాడు. గ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు ... సంతానలేమితో బాధపడుతోన్నవాళ్లు ఈ క్షేత్రానికి ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడి స్వామివారిని పూజించడం వలన ... ఆయనకి అభిషేకాలు జరపడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని అంటారు.

ఈ కారణంగా ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే పూజాభిషేకాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక 'సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజునే స్వామి జన్మించాడు కనుక ఇది ఆయనకి ఎంతో ప్రీతికరమైన రోజని అంటారు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. స్వామివారికి మొక్కుకునేవాళ్లు ... మొక్కులు చెల్లించుకునేవాళ్లు ఇక్కడ కనిపిస్తుంటారు. ఈ రోజున ఉపవాసం చేస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే స్వామి సంతోషిస్తాడనీ ... సంతృప్తితో సుఖశాంతులను అనుగ్రహిస్తాడని విశ్వసిస్తూ ఉంటారు.


More Bhakti News