శివుడు కోడి రూపాన్ని ధరించింది ఇక్కడే !

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ... రూపాలను ధరిస్తూ వచ్చాడు. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను గుర్తుచేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 'పిఠాపురం'లో అడుగుపెట్టిన భక్తులకు పరమశివుడి లీలావిశేషం ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ 'కోడి'రూపాన్ని ధరించాడు .. కోడిలా కూశాడు.

సదాశివుడు ఇలా కోడిలా మారడానికి బలమైన కారణం లేకపోలేదు. గయుడు అనే రాక్షస రాజు అనేక యజ్ఞ యాగాదులను నిర్వహించి ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. దాంతో త్రిమూర్తులను ఆశ్రయించిన దేవేంద్రుడు, తన సింహాసనం తనకి దక్కేలా చేయమని కోరతాడు. అతని అభ్యర్థన మేరకు త్రిమూర్తులు మారువేషాల్లో ఈ ప్రదేశానికి చేరుకుంటారు.

గయాసురుడి దేహంపై తాము యజ్ఞం చేయడానికి అతని అనుమతిని పొందుతారు. వారం రోజులపాటు యజ్ఞం జరుగుతుందనీ, యజ్ఞం పూర్తయిందనడానికి సూచనగా కోడి కూస్తుందని చెబుతారు. ఈలోగా అతను కదిలితే సంహరించవలసి వస్తుందని అంటారు. అలా త్రిమూర్తులు ఆరంభించిన యజ్ఞం పూర్తికావోస్తున్నా గయుడు కదలడు. దాంతో ఆయన కదిలేలా చేసి సంహరించక తప్పదని భావించిన పరమశివుడు, కోడి రూపాన్ని ధరించి ... కోడిలా కూస్తాడు.

యజ్ఞం పూర్తయిందని భావించి గయుడు కదలగానే, అతణ్ణి సంహరిస్తాడు. ఆ సదర్భంలోనే త్రిమూర్తులు గయుడికి అనేక వరాలను ప్రసాదిస్తారు. గయుడి అభ్యర్థన మేరకే పరమశివుడు లింగరూపంలో ఇక్కడ ఆవిర్భవిస్తాడు. సదాశివుడు కోడిరూపాన్ని ధరించిన కారణంగా ఆయన ఇక్కడ 'కుక్కుటేశ్వరస్వామి'గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గయుడికి త్రిమూర్తులు ఇచ్చిన వరం ఫలితంగానే ఈ క్షేత్రం 'పాద గయ'గా ప్రసిద్ధి చెందింది.


More Bhakti News