భగవంతుడు ఇలా కరుణిస్తాడు !

హరిహరుల తేజస్సు నుంచి అవతరించిన శిశువు, రాజశేఖరపాండ్యుని అంతఃపురానికి చేరతాడు. మణికంఠుడనే పేరుతో రాజదంపతుల ముచ్చటతీరుస్తూ ఎదుగుతుంటాడు. విద్యాభ్యాసం చేసే వయసు రాగానే, అతణ్ణి గురుకులానికి పంపిస్తారు. గురువు ప్రేమాభిమానాలను పొందుతూ ఆయన నుంచి అస్త్ర శస్త్ర విద్యలను అభ్యసిస్తాడు.

గురుకుల విద్య పూర్తికావడంతో, మణికంఠుడిని రాజదంపతులకు అప్పగించేందుకు ఆ గురువుగారు బయలుదేరుతాడు. అప్పటికే రాజాస్థానం నుంచి వచ్చిన కానుకలను మణికంఠుడు గురువుకి సమర్పించబోతాడు. ఆయన ఆ కానుకలను సున్నితంగా తిరస్కరిస్తూనే కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఆయన మనసులో ఏదో బాధ గూడుకట్టుకుని ఉందని గ్రహించిన మణికంఠుడు, అందుకు కారణం అడుగుతాడు.

తన ఒక్కగానొక్క కుమారుడికి పుట్టుకతోనే చూపు ... మాట లేకుండా పోయాయనీ, ఆ బాధ తనకి మనశ్శాంతి లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తాడు. దాంతో మణికంఠుడు గురువుగారి కొడుకు దగ్గరికి వెళ్లి తన అమృత హస్తంతో అతణ్ణి తాకుతాడు. అంతే ఆ క్షణమే ఆ పిల్లవాడికి చూపు ... మాట వస్తాయి. ఈ దృశ్యం చూసిన గురువుగారు ఆనందాశ్చర్యలకి లోనవుతాడు.

గురు శిష్య సంబంధాన్ని లోకానికి చాటడం కోసమే తన దగ్గర మణికంఠుడు విద్యలను అభ్యసించాడనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. మణికంఠుడు చెల్లించిన గురుదక్షిణ మానవ మాత్రులకు సాధ్యంకానిది కాబట్టి, సాక్షాత్తు ఆయన భగవంతుడేనని గ్రహిస్తాడు. కనులు ఆనందబాష్పాలను వర్షిస్తూ ఉండగా మణికంఠుడుకి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.


More Bhakti News