గుడికి దూరంగానే గ్రామాలు ?

ప్రాచీనకాలంనాటి ఆలయాలను పరిశీలిస్తే, ఆలయం చుట్టూ ఇళ్లు ఏర్పడి అది గ్రామంగా మారిన వైనం కనిపిస్తుంది. ఇక కొంతమంది రాజులు ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ దేవాలయానికి అవసరమైన సిబ్బందికి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసేవారు. అలా ఆ కుటుంబాలు పెరిగి అదొక గ్రామంగా మారుతూ ఉండేది. ఈ కారణంగానే గ్రామం మధ్యలో ఆలయం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

ఆలయానికి సమీపంగా ఉండటాన్ని భక్తులు కూడా ఇష్టపడటం వలన, చాలా దగ్గరలోనే నివాస గృహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆలయంలోని మూలవిరాట్టు నుంచి శక్తిమంతమైన తరంగాలు వెలువడుతూ ఉంటాయనీ ... అందువలన దేవాలయం నీడ పడనంత దూరంలో నివాసం ఉండాలని శాస్త్రం చెబుతోంది.

ఇక హేమాచల లక్ష్మీనరసింహుడి విషయంలో ఈ దూరం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వరంగల్ జిల్లా 'మల్లూరు' సమీపంలో గల కొండపై స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడి ఆలయానికి నాలుగైదు కిలోమీటర్ల పరిధి వరకూ నివాస గృహాలు కనిపించవు. ఇది అడవీప్రాంతం కావడమే అందుకు కారణమని అనుకుంటే పొరపాటే.

లక్ష్మీనరసింహస్వామి ఉగ్రమూర్తి కావడం ... ఇక్కడ ఆయన స్వయంభువుగా కొలువుదీరడం వలన ఇది అత్యంత శక్తిమంతమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడ స్వామివారి తీవ్రతను భరించడం కష్టమని చెబుతుంటారు. ఈ కారణంగానే ఆలయానికి దగ్గరలో గల నివాసగృహాలు తగలబడుతూ ఉండటం తరచుగా జరిగాయట. అందువల్లనే ఆలయానికి కాస్త దూరంగానే గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి.

ఇది దేవతలకు సంబంధించిన మహిమాన్వితమైన స్థలమనీ, అందువల్లనే ఇలా జరుగుతుందనేవారు కూడా లేకపోలేదు. ఉగ్రమూర్తిగా స్వామివారు ఈ కొండపైకి వచ్చినా ... చల్లని మనసుతో ఆయన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని చెబుతారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ స్వామిని సేవిస్తూ అనేక దోషాల నుంచి ... ఆపదల నుంచి బయటపడుతూ ఉంటారు.


More Bhakti News