అమ్మ చెప్పిన మాట వినకపోతే ఫలితం !

రావణాసురుడి తల్లి కైకసి మహా శివభక్తురాలు. అనునిత్యం ఆమె సాగరతీరానికి వెళ్లి ఇసుకతో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. పూజ పూర్తయిన తరువాతనే ఆమె ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండేది. ఒకసారి ఆమె అలా సాగరతీరంలో శివలింగాన్ని పూజిస్తూ ఉండగా, వేగంగా ముందుకు దూసుకు వచ్చిన ఒక కెరటం ఆ శివలింగాన్ని తాకుతుంది. ఇసుకతో ఆ శివలింగం తన రూపాన్ని కోల్పోయి నీటిలో కలిసిపోతుంది.

ఈ సంఘటన ఆమెకి ఎంతో బాధకలిగిస్తుంది. ఆ రోజున పూజ పూర్తిచేయలేకపోయినందుకు ఆమె బాధపడుతూ ఉండగా రావణుడు వస్తాడు. జరిగింది తెలుసుకుని ఆగ్రహావేశాలకి లోనవుతాడు. శ్రీమహావిష్ణువు అండదండలు చూసుకునే సాగరుడు ఆ పని చేసి ఉంటాడనీ, ఆ ఇద్దరి అంతుచూడనిదే వదలనని అంటాడు.

శ్రీమన్నారాయణుడిని ఎదిరించి నిలిచినవారు ... గెలిచినవారు లేరని చెబుతుంది కైకసి. నారాయణుడితో విరోధం వలన వంశమే నశించగలదని అంటుంది. పరమశివుడితో పాటు నారాయణుడిని కూడా సేవించమని కోరుతుంది. అలా చేసినప్పుడే ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... విజయాలు నిలుస్తాయని హితవు చెబుతుంది. విష్ణుమూర్తితో విరోధమనే ఆలోచన రానంతవరకే తామంతా సుఖ శాంతులతో ఉంటామనే విషయాన్ని మరిచిపోవద్దని అంటుంది.

తల్లి మనసు నొప్పించలేక అప్పటికి మౌనంగా ఉన్న రావణుడు, ఆ తరువాత కూడా విష్ణుమూర్తిని ద్వేషిస్తూనే వెళతాడు. విష్ణు స్వరూపమైన శ్రీరాముడి చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. అమ్మచెప్పిన మాటను పెడచెవిన పెట్టినందుకు ఫలితాన్ని అనుభవించాడు. అమ్మచెప్పిన మాటను అక్షరాలా పాటించాలనే విషయాన్ని ఈ సంఘటన మరోమారు స్పష్టం చేస్తూ ఉంటుంది.


More Bhakti News