అయ్యప్పకి పులి వాహనంగా మారిందెవరు ?

మణికంఠుడిపై గల ప్రేమానురాగాల కారణంగా ఆయనకి సింహాసనాన్ని అప్పగించాలని పాండ్యరాజు అనుకుంటాడు. అది నచ్చని మహారాణి ... మహామంత్రి ... రాజవైద్యుడు కలిసి, మణికంఠుడిని పులిపాల కోసం అడవులకు పంపిస్తారు. అలా వెళ్లిన ఆయన దేవతల తరఫున యుద్ధానికి నిలిచి మహిషిని సంహరిస్తాడు. దేవేంద్రుడికి తిరిగి సింహాసనాన్ని అప్పగిస్తాడు.

మణికంఠుడి పట్ల కృతజ్ఞతతో పులిగా మారిన దేవేంద్రుడు ఆయనకి వాహనమై సేవించుకునే భాగ్యాన్ని కలిగించమని కోరతాడు. అందుకు అంగీకరించిన మణికంఠుడు పులి వాహనాన్ని అధిష్ఠించి పందళ రాజ్యానికి బయలుదేరుతాడు. మిగతా దేవతలు కూడా పులులుగా మారి ఆయనని అనుసరిస్తారు.

పులిపాలు తీసుకురావడమనేది అసాధ్యమైన పని అనుకుని ఆ పని పురమాయిస్తే, పులిపాలకు బదులుగా పులుల సమూహంతో మణికంఠుడు తిరిగిరావడం చూసి మహారాణి ... మహామంత్రి ... రాజవైద్యుడు భయపడిపోతారు. మణికంఠుడి దగ్గర ఇంద్రాది దేవతలు సెలవు తీసుకుని వెళ్లడంతో ఆయన సాధారణమైన వ్యక్తి కాదనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. దాంతో వాళ్లు ఆయన పాదాలపై పడి క్షమాపణ కోరగా మన్నిస్తాడు.

విషయాన్ని ముందుగా గ్రహించలేకపోవడం తన తప్పేననీ, ఏదైనా పుణ్యకార్యాన్ని జరిపిస్తే తప్ప తన మనసు కుదుటపడదని అంటాడు పాండ్యరాజు. అప్పుడు మణికంఠుడు బాణాన్ని వదిలి ... అది నాటుకున్న ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించమని చెబుతాడు. స్వామి ఆదేశానుసారం ఆయనకి ఆలయాన్ని నిర్మించిన రాజశేఖర పాండ్యుడు తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు.


More Bhakti News