సర్పం వరాన్ని పొందిన క్షేత్రం ఇదే !

శ్రీమహావిష్ణువు సేవలోను ... పరమశివుడి సేవలోను సర్పజాతి తరిస్తూ వస్తోంది. స్థితి కారకుడితోను ... లయకారకుడితోను వాటికి గల అనుబంధం కారణంగానే ఇద్దరికీ సంబంధించిన క్షేత్రాల్లో సర్పదేవతలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహంతో దేవతా స్థానాన్ని పొందిన సర్పాలు, భూలోక వాసులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాయి.

సర్ప సంబంధమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో 'సర్పవరం' క్షేత్రానికి గల స్థానం ప్రత్యేకం. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ... సామర్లకోట మధ్యలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయ మహారాజు 'సర్పయాగం' చేస్తాడు. ఆ మంత్ర ప్రభావానికి ఎక్కడెక్కడో వున్న సర్పాలన్నీ కూడా వచ్చి అగ్నిగుండంలో పడి భస్మమై పోతుంటాయి.

అలాంటి పరిస్థితుల్లో సర్పజాతి అంతరించిపోతుందని భావించిన 'అనంతుడు' అనే సర్పరాజు ఈ ప్రదేశంలో శ్రీమహావిష్ణువు గురించి ప్రార్ధన చేస్తాడు. ఆ స్వామి ప్రత్యక్షంకాగానే పరిస్థితిని వివరించి, సర్పజాతిని రక్షించమని కోరతాడు. సర్పజాతిని కాపాడతానని సర్పరాజుకి స్వామి వరాన్ని ప్రసాదించడం వలన ఈ క్షేత్రానికి 'సర్పవరం' అనే పేరు వచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.

స్వామివారి పట్ల గల కృతజ్ఞతతో అనంతుడు ఇక్కడ 'మూలభావనారాయణ స్వామి'ని ప్రతిష్ఠించి పూజించాడు. అ తరువాత ఇదే ప్రదేశంలో రాజ్యలక్ష్మీ సమేత భావనారాయణ స్వామిని నారదమహర్షి ప్రతిష్ఠించాడు. పంచభావనారాయణ స్వామి క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే. సర్పసంబంధమైన ఈ గ్రామంలో పాముకాటుకి గురైన వాళ్లు చాలా తక్కువనీ, అయితే పాముకాటుకి గురైన వాళ్లెవరూ బతకలేదనే విషయం విన్నప్పుడు విస్మయం కలగక మానదు.


More Bhakti News