కొండపై పొంగిన గంగమ్మతల్లి

వనవాస కాలంలో సీతారాములు ఎన్నో ప్రాంతాలమీదుగా ప్రయాణం కొనసాగిస్తూ వెళ్లారు. ఈ సమయంలోనే రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ... సీతమ్మవారితో కలిసి పూజిస్తూ ఉండేవాడు. అలా రాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన ప్రదేశాలు ఆ తరువాత కాలంలో పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయా క్షేత్రాల్లో పుణ్యతీర్థాలు కూడా దర్శనమిస్తూ ఉంటాయి. వాటిని చూసిన భక్తులు రాతి ప్రదేశాల్లో ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటి వాటిలో కొన్ని జలధారలు రాముడి కారణంగానే భూమిపైకి వచ్చాయని చెబుతుంటారు. సీతమ్మవారి దాహం తీర్చడం కోసం ... అక్కడి ప్రజల దాహం తీర్చడం రాముడు ఈ జలధారలను భూమిపైకి రప్పించాడని అంటారు.

అలాంటి జలధారలు కలిగిన గుట్ట ప్రదేశం మనకి 'జుంటుపల్లి' లో కనిపిస్తుంది. జుంటుపల్లి ... రంగారెడ్డి జిల్లా తాండూరు మండల పరిధిలోకి వస్తుంది. వనవాస కాలంలో సీతారాములు ఈ గుట్టపై కొంతకాలం పాటు ఉన్నారని చెబుతుంటారు. ఆ సమయంలోనే సీతమ్మవారి దాహం తీర్చడం కోసం రాముడు బాణ ప్రయోగంతో రెండు నీటిధారలు సృష్టించినట్టు చెప్పబడుతోంది.

కోనేరుని పోలి కనిపించే ఈ కుండాలను సీతారాముల పేరుతోనే పిలుస్తుంటారు. మహిమాన్వితమైన ఈ కుండాలలో స్నానం చేయడం వలన పాపాలు ... దోషాలు ... వాటి ఫలితంగా బాధించే వ్యాధులు నశిస్తాయని ఇక్కడివారు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News