ఇక్కడికి అయ్యప్పస్వామి వస్తాడట !

కార్తీకమాసంలో అయ్యప్పస్వామి దీక్షధారణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో అయ్యప్పస్వామి ఆలయాలు భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఆలయాలలో నుంచి అయ్యప్పస్వామి నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడచూసినా భజనలు ... పడిపూజలు కనిపిస్తూ ఉంటాయి.

అనేక నియమాలను పాటిస్తూ దీక్ష పూర్తిచేసిన భక్తులు స్వామి దర్శనం కోసం శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు. అడవులు ... కొండలు ... రాళ్లదారులు దాటుకుంటూ బృందాలుగా స్వామి సన్నిధికి సాగుతూంటారు. అలా ప్రయాణిస్తూ అలసినవాళ్లు 'పంబానది' తీరంలో మజిలీచేస్తారు.

పంబానది పరమపవిత్రమైనదిగా చెప్పబడుతోంది. గంగానదిలో స్నానం చేయడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో, ఇందులో స్నానం చేయడం వలన కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది. సీతాన్వేషణ కొనసాగిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులు తొలిసారిగా హనుమంతుడిని కలుసుకున్నది ఇక్కడే. శ్రీరామచంద్రుడి దర్శనభాగ్యం కోసం శబరి ఎదురు చూసినది ఇక్కడే.

ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణంలోకి అడుగుపెట్టగానే, అలసటతో భక్తులు పంబానదిలో స్నానం చేస్తారు. ఆ తరువాత ఇరుముడి వెనుక ముడిలో గల ఆహార పదార్థాలతో ఇక్కడ వంట చేసుకుని అయ్యప్పస్వామి నామాన్ని చెప్పుకుని ఆరగిస్తారు. అయితే అయ్యప్పస్వామి ఏదో ఒక రూపంలో ఇక్కడికి వస్తాడనీ, తన భక్తులతో కలిసి ఇక్కడ భోజనం చేస్తాడని విశ్వసిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా ఈ ప్రదేశంలో అనేక సంఘటనలు జరిగాయని చెబుతుంటారు.

ఈ పవిత్రమైన పుణ్యస్థలిలో అడుగుపెట్టడం వలన ... పుణ్యనదిలో స్నానం చేయడం వలన కలిగిన ఉత్తేజంతో అయ్యప్పస్వాములు మరింత ఉత్సాహంగా ఇక్కడి నుంచి బయలుదేరుతుంటారు. పంబానది తీరంలో స్వామి నామస్మరణతో తరించిన క్షణాలను మనసులో భద్రంగా దాచుకుంటూ ఉంటారు.


More Bhakti News