సమస్యలను పరిష్కరించే సాయిబాబా

శిరిడీ సాయిబాబా మశీదులో ఉంటూ తన భక్తుల కష్టాలను ఎలా గట్టెక్కించాడో, సమాధి చెందిన తరువాత కూడా అదే విధంగా తన భక్తులను కాపాడుతూ వస్తున్నాడు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. సాయి మహిమలు అందరి అనుభవంలోకి వచ్చాయి కనుకనే అనేక ప్రాంతాల్లో ఆయన ఆలయాలు కనిపిస్తున్నాయి.

అనునిత్యం ఆయన రూపాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆయన ప్రతిమను తమ ప్రాంతంలోనే ప్రతిష్ఠింపజేసుకున్నారు. అలా నిర్మించబడిన సాయి ఆలయాలలో ఒకటి 'కోరుట్ల' లో కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో గల ఈ గ్రామంలో ఈ ఆలయం అలరారుతోంది.

చాలాకాలం క్రితం ఇక్కడ సాయిబాబాకు చిన్న మందిరం ఉండేది. ఆ తరువాత బాబా పట్ల గల భక్తి పెరుగుతూ ఉండటం ... ఆయన మహిమలు అనుభవంలోకి వస్తూ ఉండటంతో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణంగా కనిపించే బాబా ఆలయం ప్రశాంతతకు వేదికగా ... ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే వనంలా దర్శనమిస్తూ ఉంటుంది. చిరునవ్వుతోనే చింతలు తీర్చేలా బాబా కనిపిస్తూ ఉంటాడు.

శిరిడీలో మాదిరిగానే ఇక్కడ ఆయనకి సేవలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించబడే పర్వదినాల్లో 'కార్తీక పౌర్ణమి' కూడా ఒకటిగా కనిపిస్తుంది. ఈ రోజున బాబా సన్నిధానంలో భక్తులు దీపాలు వెలిగిస్తారు. పాపాలు తొలగించి పుణ్యరాశిని పెంచమని ప్రార్ధిస్తారు. ఇక్కడి సాయిబాబాను అంకిత భావంతో ఆరాధిస్తే, ఎలాంటి సమస్య అయినా వెంటనే పరిష్కరించబడుతుందని చెబుతుంటారు. అలా ఆయా సమస్యల నుంచి బయటపడినవాళ్లు మరింత భక్తి శ్రద్ధలతో ఆయనని సేవిస్తూ తరిస్తుంటారు.


More Bhakti News