కార్తీక పౌర్ణమిన భక్తేశ్వర వ్రత ఫలితం !

కార్తీకమాసమంతా పూజలు ... నోములు ... వ్రతాలతో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 'కార్తీక పౌర్ణమి' మరింత ప్రత్యేకత కలిగినదిగా చెప్పబడుతోంది.

ఈ రోజున శివుడు ... విష్ణువు ... శక్తి దేవతారాధన విశేషమైన పుణ్యఫలాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున శివుడికి సంబంధించి ... 'భక్తేశ్వర వ్రతం' ఆచరించాలనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలనే ఉద్దేశంతో చేసే వ్రతాలలో 'భక్తేశ్వర వ్రతం' ముందువరుసలో కనిపిస్తుంది.

అలకాపురి మహారాజు కుమార్తె మహా సౌందర్యవతి ... అంతకుమించిన గుణవతి. సదాశివుడిని సదా అర్చించే ఆమెకి చంద్రపాండ్య మహారాజు కుమారుడితో వివాహం జరుగుతుంది. అతను అల్పాయుష్కుడు అనే విషయం తెలిసిన ఆమె ఎంతగానో బాధపడుతుంది. ఆ మహాదేవుడే తన భర్తకి సంపూర్ణమైన ఆయుష్షును ప్రసాదిస్తాడని ధైర్యం తెచ్చుకుంటుంది.

మనసు నిండా మహాదేవుడి పట్ల భక్తిని నింపుకుని, కార్తీక పౌర్ణమి రోజున 'భక్తేశ్వర వ్రతం' ఆచరిస్తుంది. ఉపవాస దీక్షను చేపట్టి ... ప్రదోష వేళలో పరమశివుడిని పూజిస్తూ నియమనిష్టలతో వ్రతాన్ని పూర్తిచేస్తుంది. ఈ వ్రత ఫలితంగా యమభటులు ఆమె భర్తను సమీపించలేకపోతారు. అందుకు అడ్డు పడుతున్నది సాక్షాత్తు సదాశివుడని తెలిసి వెనుదిరుగుతారు.

సదాశివుడు యువరాణికి ఎదుట నిలిచి ఆమె భర్తకి సంపూర్ణమైన ఆయుష్షును ప్రసాదిస్తున్నట్టుగా చెప్పి అదృశ్యమవుతాడు. ఈ వ్రతం ద్వారా తన ఐదవతనాన్ని కాపాడుకోగలిగినందుకు ఆమె ఆనందంతో పొంగిపోతుంది. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే ఈశ్వరుడు కనుక భక్తేశ్వరుడుగా ఆ స్వామి ఈ రోజున పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు ... అనుగ్రహిస్తూ ఉంటాడు.


More Bhakti News