ఆశ్ఛర్యచకితులనుచేసే అర్థనారీశ్వర లింగం !

ఆదిదేవుడు ఆవిర్భవించిన ఒక్కోక్షేత్రం ఒక్కో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఒక క్షేత్రంలో శివలింగం పెరుగుతూ ఉంటుంది. మరో క్షేత్రంలో శివలింగం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. ఇంకో క్షేత్రంలో శివలింగం రెండు భాగాలుగా అర్థనారీశ్వర రూపానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి విశేషాలన్నింటిని కలిగిన క్షేత్రం ఒకటుంది ... అదే 'మేళ్ల చెరువు'.

నల్గొండ జిల్లాకి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా మేళ్లచెరువు దర్శనమిస్తుంది. సాక్షాత్తు పరమశివుడు ఒక భక్తుడికి స్వప్నంలో కనిపించి తాను ఫలానాచోట ఆవిర్భవించినట్టు చెప్పి వెలుగులోకి వచ్చాడు. శివలింగం వెలుగుచూసిన చోటునే ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ శివలింగం పెరుగుతూనే వస్తోంది.

ఇక శివుడి శిరస్సున 'గంగ'లా శివలింగానికి ఒక రంధ్రం కనిపిస్తుంది. ఇందులో నుంచి జల అదే పనిగా నిరంతరం ఊరుతూనే ఉంటుంది. శివలింగానికి మధ్యలో గల గాడి కారణంగా ఇది రెండు భాగాలు కనిపిస్తుంది. వెనుక భాగాన అమ్మవారి కేశాలను గుర్తుచేస్తూ రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఇది అర్థనారీశ్వర లింగంగా చెప్పబడుతోంది.

ఇన్ని విశేషాలను కలిగిన ఈ శివలింగానికి పూజాభిషేకాలు జరిపించడం వలన సాక్షాత్తు శివపార్వతులను ప్రత్యక్షంగా ఆరాధించిన ఫలితం లభిస్తుందని అంటారు. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆదిదంపతుల అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని విశ్వసిస్తుంటారు. గ్రామీణ వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రం వనభోజనాలకు అనుకూలంగా ఉంటుంది. అందువలన కార్తీకమాసమంతా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అర్థనారీశ్వరుడిని పూజించి పునీతులవుతుంటారు.


More Bhakti News