క్షీరాబ్ది ద్వాదశిన తులసిపూజా ఫలితం !

తులసి .. లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది. అందువలన చాలామంది తమ ఇంట్లో తులసికోటను ఏర్పాటు చేసుకుంటారు. అనునిత్యం ఉదయం వేళలోను ... సంధ్యా సమయంలోను స్నానం చేసి తులసికోటలో దీపం పెడుతుంటారు. తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసి సంతాన సౌభాగ్యాలను గురించి ప్రార్ధిస్తుంటారు.

సాధారణ రోజుల్లో చేసే తులసిపూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇక కార్తీకమాసంలో చేసే ఆరాధన వలన లభించే ఫలితాలు అనంతమైనవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసిని పూజించడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. కార్తీక శుద్ధ ద్వాదశిని 'క్షీరాబ్ది ద్వాదశి' గా చెప్పబడుతోంది.

అమృతం కోసం క్షీరసాగర మథనం ఆరంభించబడినది ఈ రోజునే. ఈ కారణంగానే దీనిని మథన ద్వాదశిగా కూడా పిలుస్తుంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై క్షీరసాగరం నుంచి బయటికి వచ్చి తులసి కోటలోకి ప్రవేశిస్తాడు. అందువలన దీనిని తులసి ద్వాదశిగా కూడా భావిస్తుంటారు. లక్ష్మీదేవి సమేతంగా శ్రీమహావిష్ణువు తులసికోటలో కొలువుదీరిన కారణంగా ఈ రోజున తులసి పూజ మరింత విశేషమైనదిగా చెప్పబడుతోంది. లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని స్పష్టం చేయబడుతోంది.

తులసికోటను పుష్ప మాలికలతో అలంకరించి, దాని చుట్టూ దీపాలు వెలిగించి అత్యంత భక్తిశ్రద్ధలతో తులసిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిపూజ చేయడం వలన ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా, అపమృత్యు దోషాలు సైతం తొలగిపోతాయని చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున తులసిని పూజించడం ... దగ్గరలోని వైష్ణవ ఆలయాన్ని దర్శించడం మరచిపోకూడదు.


More Bhakti News